తెలంగాణ హైకోర్టులో మహేశ్వరం రైతులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అంతకు ముందు రామ్ కీ సంస్థకు అనుకూలంగా ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని హైకోర్టును రైతులు ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ మేరకు స్టే ఇచ్చింది.
గతంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ లో సర్వే నంబర్ 227, 230ల్లో విస్తరించిన 80 ఎకరాల్లో ఉన్న డిస్కవర్ సిటీలో ప్లాట్లు, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు రామ్ కీ సంస్థకు అనుమతిస్తూ సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాజాగా రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది.
రామ్‌కీ, రాష్ట్ర ప్రభుత్వం దాని ఏజెన్సీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా ఈ ప్రాంతంలో 750 ఎకరాలను మూడు దశల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేసేందుకు అంగీకరించాయి. మొదటి దశలో 400 ఎకరాలను అభివృద్ది చేయాలని నిశ్చయించాయి.
అందులో 375 ఎకరాలు ప్రైవేట్ యాజమానులకు సంబంధించింది. మొదటి దశ అభివృద్ధి పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 100 కోట్లను చెల్లించేందుకు రామ్ కీ సంస్థ అంగీకరించింది. అయితే కేవలం రూ. 25 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా ఇప్పటికీ 75 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఇది ఇలా వుంటే రామ్ కీ సంస్థ ఆ విల్లాలు, ప్లాట్ లను విక్రయించేందుకు ప్రయత్నించగా వాటిని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం నిషేధిత జాబితాలో వాటిని చేర్చి రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు హెచ్ఎండీఏ ప్రయత్నించింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
డెవలప్ మెంట్ ఒప్పందాన్ని అమలు చేయడంలో, డెవలపర్ పై శిక్షార్హమైన చర్యలు తీసుకోవడంలో హెచ్ఎండీఏ అధికారులు మౌనంగా వుండటాన్ని సింగిల్ జడ్జి బెంచ్ ప్రశ్నించింది. అయితే రిజిస్ట్రేషన్‌లలో ముందుకు సాగేందుకు రామ్ కీ సంస్థకు ధర్మాసనం అనుమతులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్లు సివిల్ కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉన్నందున తమ అనుమతి లేకుండా తమ భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు రామ్ కీ సంస్థకు ఎలాంటి అధికారాలూ లేవని పిటిషన్‌లో రైతులు పేర్కొన్నారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల విన్న అనంతరం సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని హెచ్‌ఎండీఏ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఇతరులను ఆదేశించింది. కేసును ఈ నెల 22కు వాయిదా వేసింది.