రేపు విచారణకు హాజరు కాలేనని, విచారణకు హాజరవ్వడానికి తనకు 10 రోజుల గడువు కావాలన్న కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు అభ్యర్థనకు సైబర్ క్రైం పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయనకు ఊరట లభించింది.
సైబర్ క్రైం పోలీసులు సునీల్ కనుగోలుకు వచ్చే ఏడాది జనవరి 8 వ తేదీ వరకు అనుమతి ఇచ్చారు. దీంతో రేపటి విచారణకు ఆయన హాజరు పై సస్పెన్స్ వీడింది. మరో వైపు సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలతో పాటు మంత్రి కేటీఆర్ లను కించపరుస్తూ పోస్టులు పెట్టారని సునీల్ కనుగోలుపై ఆరోపణలు వచ్చాయి.
ఈనేపథ్యంలో ఆయనకు సబంధించిన కార్యాలయంపై పోలీసులు సోదాలు నిర్వహించి పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో డిసెంబర్ 30 న విచారణకు హాజరుకావాలంటూ సునీల్ కనుగోలుకు సైబర్ క్రైమ్ పోలీసులు 41 ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు.
ఇక ఇలా ఉంటే.. సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సునీల్ కనుగోలు గురువారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 41 ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది.