పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు లాహోర్ హైకోర్టు నుంచి స్వల్ప ఊరట లభించింది. ఆయనను రేపు ఉదయం 10 గంటలవరకు అరెస్టు చేయరాదని కోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. ఇమ్రాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఈ ఉదయం నుంచే లాహోర్ లో ఆయన నివాసం ఉంటున్న జమాన్ పార్క్ కి చేరుకున్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు కూడా అయిన తమ నేత అరెస్టు కాకుండా చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు.
వారికీ , పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఒక దశలో జమాన్ పార్క్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘర్షణల్లో ఉభయ వర్గాల నుంచి పలువురు గాయపడ్డారు. ఇక తోషిఖానా కేసులో తనకు జారీ చేసిన అరెస్ట్ వారంట్ పై స్టే విధించాలని కోరుతూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
ఈ నెల 18 న తాను స్వయంగా కోర్టుకు హాజరవుతానని కూడా ఆయన మరో అఫిడవిట్ లో తెలిపారు. లాహోర్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఇమ్రాన్ సన్నిహితులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.
అయితే లాహోర్ హైకోర్టు ఇమ్రాన్ కు తాత్కాలిక ఊరటనిచ్చిందని, గురువారం ఉదయం 10 గంటల తరువాత పరిస్థితి ఏమిటని డాన్ పత్రిక పేర్కొంది. జమాన్ పార్క్ వద్ద ఇంకా వందలాది ఇమ్రాన్ మద్దతుదారులు ఉన్న విషయాన్ని ఈ పత్రిక ప్రస్తావించింది. పైగా ఓ మహిళా జడ్జిని బెదిరించిన కేసు కూడా ఇమ్రాన్ పై ఉంది.