ఎనిమిది రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మతానికి సరిహద్దులు లేవని…మతాన్ని రాష్ట్రాల వారీగా కాకుండా దేశవ్యాప్తంగా చూడాలని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఒక మతాన్ని మైనార్టీగా ప్రకటించాల్సింది ప్రభుత్వం అని..కోర్టు కాదని పిటిషనర్, బీజేపీ లీడర్, లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయకు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గుర్తు చేసింది.
పార్శీ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్దిస్టులను మైనార్టీలుగా ప్రకటిస్తూ 26 ఏళ్ల క్రితం విడుదల చేసిన నోటిఫికేషన్ ను పిటిషనర్ సవాల్ చేశారు. ”భాషలు రాష్ట్రాలకే పరిమితం…కానీ మతానికి సరిహద్దులు లేవు..మేము మొత్తం దేశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి…లక్ష్యదీప్ లో ముస్లింలు హిందూ చట్టాన్ని అనుసరిస్తున్నారు” అని ధర్మాసనంలోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ”మేము పిటిషనర్ తో ఏకీభవించం…మేము ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వగలం..? కోర్టులు ఎవరిని మైనార్టీలుగా ప్రకటించలేదు..ప్రభుత్వం ఆ పని చేసిందని ” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.