హైదరాబాదు సంస్థానానికి విముక్తి కల్పించిన గొప్ప వ్యక్తి!!
(సెప్టెంబర్ 3 రామానంద తీర్థ జయంతి)
అమర్ నాథ్ సారంగుల
జాతీయ సలహా మండలి సభ్యుడు
కేంద్ర పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ
మనది 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. భారతీయులమైన మనం అజాది కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవం.. అంటే సెప్టెంబరు 17 ను అమృత్ మహోత్సవ్ గా జరుపుకోవాలని ప్రకటించింది. 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ మాట్లాడుతూ, “ప్రస్తుత తరాలకు మన జాతీయ నాయకుల గురించి చెప్పకపోవడం మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య” అని చెప్పారు.
ముఖ్యంగా సంస్థానాల విలీనానికి కృషి చేసిన వారి గురించి ఇప్పటి తరాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. చరిత్ర ఎప్పుడు రెండో పేజీ నుంచి ప్రారంభమవుతోంది. మొదటి పేజీని విస్మరించడమో లేదా దాచేయడమో జరుగుతోంది. ఇదే తరహాలో భారత స్వాతంత్ర ఉద్యమంలో అనేక అధ్యాయాలు మరుగున పడ్డాయి. అలాంటి వాటిలో అతి ముఖ్యమైన.. బహుశా అతిపెద్ద అధ్యాయం హైదరాబాద్ విముక్తి ఉద్యమం.
రాచరిక వ్యవస్థపై జరిగిన ఈ పోరాటంలో మనం స్మరించుకోవలసిన ముఖ్యమైన వ్యక్తి స్వామి రామానంద తీర్థ. అక్టోబర్ మూడున స్వామి నామానంద తీర్థ జయంతి సందర్భంగా ఆయన గొప్పదనాన్ని స్మరించుకోవడంతో పాటు ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.
స్వామి రామానంద తీర్థ ఉపాధ్యాయుడి నుంచి స్వాతంత్ర్య సమరయోధుడిగా మారిన ఒక సన్యాసి. ఆయన ఒక నిజమైన గాంధేయవాది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన గాంధీని సైతం ధిక్కరించారు. ఆయన ఎల్లప్పుడూ సత్యాగ్రహం, ప్రజా భాగస్వామ్యం వంటి గాంధేయ విధానాలను నమ్మేవారు.
అని ఎప్పుడు అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం తపించేవారు. స్వామి నిరంతరం పేదల గురించే ఆలోచించేవారు అందుకే ఆయన ఎంతోమందికి హీరోగా మారారు. స్వామి ఎన్నో విద్యాసంస్థలను ప్రారంభించారు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టి లక్షల మంది అభిమానాన్ని సంపాదించారు.
స్వామి రామానంద తీర్థ గారు 1903 అక్టోబర్ 3న ప్రస్తుత కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా సింగ్డే లో జన్మించారు.
ఆయన అసలు పేరు వెంకటేష్ భగవాన్ రావు కేడికర్. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని గంగాపుర్ లోని దత్తక్షేత్రంలో పూర్తి చేశారు.కల్యాణి, షోలాపూర్ లో మిగతా చదువు పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఆయన చదువులో చురుకుగా ఉండేవారు. తిలక్ విద్యాపీఠం నుంచి బి.ఏ, పూణే యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు.
1929లో హిప్పర్గ నేషనల్ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడుగా తన వృత్తి జీవితం ప్రారంభించారు. ఉపాధ్యాయుడుగా ఓవైపు పాఠాలు చెప్తూనే మరోవైపు రాజకీయాలు, ప్రజాస్వామ్య విలువలు వంటి వాటి గురించి విద్యార్థులకు వివరించి చెప్పేవారు. తద్వారా భవిష్యత్తు ప్రజా ఉద్యమానికి నాయకులను అందించారు. అక్కడే ఆయన సన్యాసం స్వీకరించారు. ఆయన బోధనలకు ఎంతోమంది ఆకర్షితులయ్యారు.
అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని ఏడవ నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ పాలిస్తున్నారు. 1724కు ముందు ఈ వంశం వాళ్ళు మొఘలులకు గవర్నర్లుగా పనిచేసేవారు. ఆ తర్వాత స్వతంత్రం ప్రకటించుకొని రాజులుగా మారారు. నిజాం రాజులు చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తూ పాలించారు. ప్రజలను పట్టించుకోకుండా విలాసవంతమైన జీవనం గడిపేవారు. సంస్థానంలోని మారుమూల ప్రాంతాలను వాళ్ళు ఎప్పుడూ సందర్శించలేదు. వాళ్లు పన్ను వసూలు దారులు, పోలీసు బలగాల సాయంతోనే హైదరాబాద్ సంస్థాన ప్రజలపై పెత్తనం చెలాయించేవారు.
నిజాం పాలనలో అధికారమంతా ముస్లింల చేతుల్లోనే ఉండేది. ప్రజల్లో 85% హిందువులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రం 10 శాతం కూడా ఉండేవారు కాదు. దీంతో ప్రజల్లో నిజాం రాజులపై వ్యతిరేకత పెరిగింది. అంతులేని నిరంకుశత్వం, వివక్ష గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది యువత ఆయుధాలు పట్టి నిజాంపై తిరుగుబాటు చేయడానికి కారణమైంది. ఆ సాయుధ పోరాటం క్రమంగా ప్రజా ఉద్యమంగా మారింది. ప్రాంతాలకు అనుగుణంగా ఆంధ్ర మహాసభ, మహారాష్ట్ర పరిషత్, కర్ణాటక పరిషత్ వంటివి ఏర్పడ్డాయి.
ఆ అనిశ్చితి సమయంలో, హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటానికి కుల, మతాలకు అతీతంగా ప్రజలను సేకరించి నడిపించే బాధ్యతను స్వామీజీ స్వయంగా స్వీకరించారు. రాజకీయ వేదిక ప్రాధాన్యతను నొక్కి చెబుతూ.. మరాఠాల మహారాష్ట్ర పరిషత్, కర్ణాటక కన్నడిగుల పరిషత్, తెలుగువారి ఆంధ్ర మహాసభ సభ్యులతో కలిసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యూనిట్‌ను స్థాపించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రాజకీయ వర్గాలను ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్’ అనే బ్యానర్ కిందకు తీసుకురావాలని స్వామీజీ భావించారు.
ఒకవైపు నెహ్రూ గాంధీ నిజాంకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుకోలేదు, మరోవైపు సర్దార్ పటేల్ విముక్తి పోరాటానికి బలమైన మద్దతుదారుడుగా నిలబడ్డారు. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో జరిగిన హరిపుర కాంగ్రెస్ సమావేశంలో (1937) హైదరాబాద్ స్టేట్ యూనిట్ కాంగ్రెస్ స్థాపనను స్వామీజీ ప్రతిపాదించారు . పోరాట అవసరాన్ని, అందుకు పార్టీరాష్ట్ర శాఖ కోసం ఆయన చేసిన అపారమైన ప్రయత్నాలకు ఫలితం లభించింది.
చాలా కష్టంతో, మరికొంత అయిష్టంతో స్వామీజీ చేసిన ప్రతిపాదన అంగీకరించబడింది. అయితే, దురదృష్టవశాత్తు, నియంతృత్వ నిజాం నవాబు కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ ఏర్పడక ముందే దానిని నిషేధించారు. కాగా, స్వామీజీ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ స్థాపనకు తన పోరాటాన్ని కొనసాగించారు. సత్యాగ్రహ బి సహాయ నిరాకరణ ఉద్యమాలు చేసారు మరియు నిజాంచే అరెస్టు చేయబడ్డారు. అక్టోబరు 24, 1938న ఆయన ప్రారంభించిన సత్యాగ్రహం నిజాంకు వ్యతిరేకంగా చరిత్రలో మొట్టమొదటి అధికారిక నిరసన.
హైదరాబాద్ రాష్ట్రం ఏప్రిల్ 1946లో క్విట్ ఇండియా ఉద్యమం ముగిసిన తర్వాత1947లో నిజాం స్టేట్ కాంగ్రెస్ పై నిషేధాన్ని ఎత్తివేశాడు.. స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌కు మొదటి అధ్యక్షుడయ్యారు. అక్కడ స్వాతంత్య్రం కోసం నిజాంపై అంతిమ పోరాటానికి పిలుపునిచ్చారు. హైదరాబాద్ గడ్డపైనే భారత స్వాతంత్య్రం కోసం అంతిమ సంగ్రామం జరుగుతుందని స్వామీజీ ప్రకటించి నిజాంతోపాటు అతని రాక్షస సేనాని, రజాకారు మూకల నేత కాశింరజ్వీకి బహిరంగ సవాల్ విసిరారు. అహింసా మార్గంలో వెళ్లి వివిధ సత్యాగ్రహ ఉద్యమాలతో నిజాంపై స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలను నడిపారు.
హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో భాగం కావాలని స్వామీజీ ఆధ్వర్యంలోని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ముమ్మర ప్రచారం ప్రారంభించింది. దీనిని నిజాం తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆగస్టు 7, 1947న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియన్ యూనియన్ డేగా సంస్థాన ప్రజలు జరుపుకున్నారు. జాతీయ జెండాలు ఎగురవేసి నిరసనలు, సమ్మెలు చేశారు.
దీంతో భయపడిన నైజాం ప్రభుత్వం మరోసారి కాంగ్రెస్ ను నిషేధించింది. భారీగా అరెస్టులు జరిగాయి. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి తిరుగుబాటుకు కారణమయ్యారన్న నేరారోపణపై స్వామి రామానంద తీర్థను 111 రోజులపాటు నిజాం నవాబు జైలులో నిర్బంధించారు. ఇదిలా ఉండగా నిజాం రాష్ట్రంలో రజాకార్ల దౌర్జన్యాల కారణంగా యుద్ధ వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్రంగా లేదంటే పాకిస్థాన్ లో విలీనం చేయాలన్న నిజాం నవాబు కుటిల యత్నాలు పసిగట్టిన అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు 13 సెప్టెంబర్ 1948న ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. భారత సేనల ముందు నిజాం పోలీసులు, రజాకారు మూకలు తోక ముడిచాయి. 17 సెప్టెంబర్ 1948న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ముందు నిజాం నవాబు లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో భాగమైంది.
హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రముఖ నాయకులైన స్వామి రామానంద్ తీర్థ, పండిత నరేంద్ర, వినాయక్ రావు లు విడుదల చేయబడ్డారు. పోలీసు చర్య తర్వాత జంట నగరాల్లో మతలకహాలు జరుగకుండా నివారించడంపై యూనియన్ సైన్యం వీరి సహకారాన్ని తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించడంపై దృష్టి సారించాలని, వారి సాయుధ పోరాటంతో శాంతిభద్రతలు, పేదలకు నష్టమని స్వామీజీ భారత ప్రభుత్వానికి సూచించారు.
స్వామీజీ ఎల్లప్పుడూ గాంధీ సిద్ధాంతాలను విశ్వసించారు. సాయుధ ఉద్యమం యొక్క ప్రాథమిక కారణం వ్యవసాయ సంస్కరణలు చేసేందుకు ఆయన మద్దతు తెలిపారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం స్వామీజీ తన జీవితకాలం వెచ్చించారు.
స్వామి రామానంద తీర్థ 1972 జనవరి 22న (69 సంవత్సరాల వయస్సులో) తుది శ్వాస విడిచారు. ఆయన శిష్యుడు, భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు, హైదరాబాద్‌లోని బ్రాహ్మణవాడిలోని “స్వామి రామానంద తీర్థ స్మారకాన్ని స్వామీజీ పార్థివ దేహానికి విశ్రాంతి స్థలంగా అభివృద్ధి చేశారు.
స్వామిజీ జ్ఞాపకార్థం అప్పటికి భూదాన్ పోచంపల్లిలో రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ యొక్క లక్ష్యం మరియు పనితీరు ప్రజలను ముఖ్యంగా యువత మరియు మహిళలకు సాధికారతకు 1995లో భారత ప్రధాన మంత్రి, శ్రీ పి.వి.నరసింహారావు గారు సంకల్పించారు. స్వామి రామానంద తీర్థ విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, పార్లమెంటేరియన్. ఆయన నిజమైన గాంధేయవాది, ఆయన తన జీవితాన్ని పేద ప్రజల అభ్యున్నతికి అంకితం చేసారు. పేద, వెనుకబడిన ప్రజలకు విముక్తి కలిగించిన సన్యాసిగా ఎప్పుడూ ఆయన్ను సదా ఘనంగా స్మరించుకుంటూనే ఉంటారు.