మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భర్త నుండి దూరంగా వెళ్లిపోయి ఉంటున్న భార్య మంగళసూత్రమును తీసివేయడమంటే భర్తను మానసిక క్రూరత్వానికి గురిచేయడమేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ కేసులో భర్తకు హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఈరోడ్ లోని మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శివకుమార్‌కు విడాకులు మంజూరు చేసేందుకు స్థానిక ఫ్యామిలీ కోర్టు 2016లో నిరాకరించింది. దీంతో ఫ్యామిలీ కోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై వీఎం వేలుమణి, ఎస్. సౌందర్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
భర్త నుంచి విడిపోయిన సమయంలో తాను తాళిని తొలగించిన విషయాన్ని శివకుమార్ భార్య అంగీకరించింది. తాను కేవలం గొలుసును మాత్రమే తొలగించానని, మంగళసూత్రాన్ని ధరించానంటూ చెప్పుకొచ్చింది. దీనిపై ఆమె తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ….
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం… తాళి కట్టాల్సిన అవసరం లేదన్నారు. అందువల్ల తాళిని ఆమె తొలగించినా వారి వైవాహిక బంధంపై అది ఎలాంటి ప్రభావమూ చూపదని వివరించారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. వివాహ సమయంలో తాళి కట్టడమనేది ముఖ్యమైన ఆచారమని వ్యాఖ్యానించింది.
హిందూ సమాజంలో ఓ వివాహిత తన భర్త జీవితకాలంలో ఏ సమయంలోనూ తాళిని తీసేందుకు సాహసం చేయలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ ఆమె తన తాళిని తీసేసినట్టు, దాన్ని బ్యాంక్ లాకర్‌లో పెట్టినట్టు ఆమె చెప్పిందని ధర్మాసనం వెల్లడించింది.
వివాహితకు తాళి చాలా పవిత్రమైన విషయమని, ఆమె వైవాహిక జీవితంలో ఉన్నట్టు తాళిసూచిస్తుందని కోర్టు పేర్కొంది. తాళిని భర్త మరణించిన తర్వాత మాత్రమే తొలగిస్తారని పేర్కొంది. కాబట్టి ఇలా ఆమె తాళిని తీసివేయడాన్ని భర్తను మానసికంగా హింసించే చర్యగా పరిగణించవచ్చని చెప్పింది. ఇది అత్యున్నత స్థాయి మానసిక క్రూరత్వానికి పరాకాష్టగా కోర్టు అభివర్ణించింది. దీంతో అతనికి విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.