చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత విమర్శకులు, గీతరచయిత, కవి ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు.
భర్తలాగానే రామలక్ష్మి సైతం మంచి విమర్శకురాలు. 1951 లో ఆమె రచనా ప్రస్థానం మొదలయ్యింది. 1954లో ఆమె రాసిన ‘విడదీసే రైలుబళ్ళు’ రచన మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక దీని తరువాత మెరుపు తీగె, అవతలిగట్టు, తొణికిన స్వర్గం, ప్రేమించు ప్రేమకై, ఆంధ్రనాయకుడు, పండరంగని ప్రతిజ్ఞ లాంటి ఎన్నో రచనలు రాసి మెప్పించారు.
ఆరుద్ర రాసిన సినిమా పాటలే కాదు, చారిత్రక పరిశోధనల్లోనూ రామలక్ష్మి సహాయసహకారాలు ఉన్నాయి. ఇక కె.రామలక్ష్మి సెన్సార్ బోర్డ్ మెంబర్ గానూ పనిచేశారు. గత కొన్నేళ్ల క్రితం ఆమె సీనియర్ హీరోలు ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ వ్యక్తిగత జీవితాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఎన్ని సంచాలనాలను సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
. ఆమె మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.