మహబూబ్ నగర్, తొలివెలుగు:నూతన కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ శాఖలు నెలసరి అద్దె చెల్లించాలని హుకుం జారీ చేశారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావ్. పాల్కోండ గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి గత నెల 4వ తేదీన ప్రారంభించారు. హుటాహుటిన ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన సుమారు 62 శాఖలు మార్చబడ్డాయి. 34 శాఖల కోసం ఏర్పాటు చేసిన కలెక్టర్ కార్యాలయంలో 62 శాఖలను కుక్కారు. ఒకే గదిలో రెండు, మూడు శాఖలు వుండటంతో ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు బాగానే వుంది.
అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ప్రతినెలా 5వ తేదీ వరకు చెక్కు రూపంలో నెలసరి అద్దె కట్టాలంటూ హుకుం జారీ చేయడంతో ఉద్యోగస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక శాఖకు రూ.20 వేలు, మరో శాఖకు రూ.30 వేలు ఇలా 62 శాఖలకు చెందిన వారు నెలసరి అద్దె చెల్లించాలంటూ జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశించారు.
ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ప్రతినెలా మూడు నుంచి నాలుగు వేల వరకు ఇవ్వాల్సి వస్తుందన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహణ కోసం, తోటమాలిని, సెక్యూరిటి గార్డ్, కొత్తగా తీసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు ఇలా వసూలు చేస్తున్నారట.
ప్రతినెలా డబ్బులు చెల్లించాలని కలెక్టర్ ఆర్డర్ జారీ చేయడం పట్ల ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న శాఖలకు చెందిన వారిని కూడా కొత్త కలెక్టర్ కార్యాలయానికి మార్చడం జరిగింది. వారి నుంచి కూడా నెలసరి డబ్బులు చెల్లించాలని కోరడంతో ఏమి చేయాలో తోచక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు.