రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి ఎందుకు స్పెషల్ టీం పంపడం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా అని నిలదీశారు. తెలంగాణలో కేంద్ర బృందం దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు.
ఎక్కడా ప్రోటోకాల్ అమలు కావడం లేదని.. ఆఖరికి గవర్నర్ పర్యటనను కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు రేణుకా చౌదరి. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన గవర్నర్ హోదాను అవమానపరుస్తున్నారని.. టీఆర్ఎస్ పాలనా విధానం ఇదేనా అని విమర్శించారు. ఖమ్మంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై అక్రమంగా పీడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. చివరకు కోర్టు ఆదేశాలిచ్చినా అమలు కావడం లేదని ఆరోపించారు.
బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఆయన్ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించి.. ఏ1 నిందితుడిగా చేర్చాలన్నారు. పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటే ఏసీపీకి సంబంధం లేదా?.. ఈ కేసులో ఏసీపీ కూడా నిందితుడేనన్నారు. రజాకార్లను ఎదిరించారన్న చరిత్ర ఉన్న తెలంగాణ పోలీసులు.. ప్రభుత్వానికి తొత్తులుగా బతికే పరిస్ధితికి దిగజారారని విమర్శించారు. పోలీస్ సిబ్బంది ఎన్నికల్లో డబ్బులు కూడా పంచుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎవరితో పొత్తులు పెట్టుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు రేణుకా చౌదరి. తమ కార్యకర్తలు పొత్తులను అగీకరించరని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పారు.