కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్ భవన్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేయడంతో కార్యకర్తలు వాహనాలకు అడ్డుపడ్డారు. అక్కడి నుంచి వెళ్లకుండా నిరసన తెలిపారు. అయితే.. పోలీసులు వారిని పక్కకు లాగేశారు. లాఠీఛార్జ్ కూడా చేశారు. అయితే.. అరెస్ట్ సమయంలో రేణుకా చౌదరి హల్ చల్ చేశారు.
తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్సై కాలర్ పట్టుకుని నిలదీశారు. తనను టచ్ చేస్తే ఈడ్చుకెళ్తానని హెచ్చరించారు. మహిళా పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా వారిపైనా రెచ్చిపోయారు. ఒక మహిళా పోలీస్ ను చేతితో నెట్టారు. పోలీసులకు రేణుకా చౌదరి మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది.
రేణుకా చౌదరిని బలవంతంగా పోలీస్ జీపులో ఎక్కిస్తుంటే వదలండంటూ సీరియస్ అయ్యారు. మీరు నా చీర లాగారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాద లేకుండా మహిళలపై దౌర్జన్యం ఏంటని మండిపడ్డారు. మమ్మల్ని ఆపడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. ఈరోడ్డుకు తాను ట్యాక్స్ కట్టానంటూ ఫైరయ్యారు. చివరకు పోలీసులు ఆమెను బలవంతంగా జీపులో ఎక్కించారు.
రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఖైరతాబాద్ లో బైక్ కు నిప్పు పెట్టి.. బస్ పైకి ఎక్కి నిరసన తెలిపారు కాంగ్రెస్ శ్రేణులు. రేవంత్ రెడ్డి వచ్చాక ర్యాలీగా రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ పోలీసులు కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు. రేవంత్ తోపాటు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ రెడ్డి పలువురు నేతలు ఉన్నారు.