బాబుగారు మొదటిసారి గట్టి పంచ్ కొట్టారు. డెడ్ లైన్ తర్వాత ఏం చేస్తారా.. ఏం చెబుతారా అని ఎదురుచూసినవారికి ఏమీ లేదనిపించింది. బాబుగారి ప్రజంటేషన్ అలా ఉంటుంది కాబట్టి.. అసలు పంచ్ ఎవరికీ రీచ్ కాలేదు. ఆయన స్టేట్ మెంట్ డీటెయిల్డ్ గా పేపర్లలో చదివితేనే ఆ విషయం అర్ధమవుతుంది. కాని పాపం ఆయన తనదైన స్టయిల్ లో ఉపోద్ఘాతం భారీగా ఇవ్వడంతో.. అసలు సంగతి వెనక్కు పోయింది. ఇంతకీ ఆయన విసిరిన పంచ్ ఏంటంటే.. ‘‘మీరు అమరావతిని రాజధానిగా ఒప్పుకోండి. నేను, నా పార్టీ ఎమ్మెల్యేలమంతా రాజీనామాలు చేయటమే కాదు.. ఆ స్థానాలను మీకే వైసీపీకే వదిలేస్తాం‘‘..
అంటే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే.. టీడీపీ మొత్తం తమ నియోజకవర్గాలను వైసీపీ చేతిలో పెడుతుందన్నమాట. ఇంత పెద్ద విషయాన్ని ఆయన చాలా మామూలుగా చెప్పటం.. మీడియా పెద్దగా హైలెట్ చేయకపోవడం.. ఈవెన్ ప్రింట్ మీడియాలో సైతం.. దానిని అంతగా ఎలివేట్ చేయకపోవడంతో.. ఆ విషయం ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లుగా అనిపించడం లేదు.
అసలు బాబుగారి యాటిట్యూడ్ కి.. ఇలాంటి పంచ్ లు వేయడం మామూలు విషయం కాదు. ఏదైనా చెప్పాలంటే కర్ర విరగకుండా.. పాము చావకుండా చెప్పడం ఆయన పద్ధతి. ఏదీ తొందరగా తేల్చరు. తేల్చిన విషయాన్ని చెప్పటానికి కూడా చాలా టైమ్ తీసుకుంటారు. అలాంటిది 48 గంటల డెడ్ లైన్ అయిపోయాక.. నేరుగా విషయాన్ని చెప్పకుండా.. మళ్లీ మొదలుకాడి నుంచి మొదలుపెట్టి చెప్పడంతో.. అసలు విషయం అర్ధం కాకుండా పోయింది. అదే నేరుగా ఇదే పంచ్ డైలాగ్.. ఓపెనింగ్ లోనే చెప్పుంటే.. జనానికి బాగా ఎక్కేది. అసలే అమరావతి వ్యవహారం మంచి వేడి మీద ఉంది. హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో రైతులంతా కాస్త రిలీఫ్ పొందారు. న్యాయనిపుణులంతా ఈ బిల్లులు న్యాయస్థానంలో నిలవవని చెబుతుండటంతో వారిలో మళ్లీ ఆశలు పెరిగాయి. ఆ సిట్యుయేషన్ లో.. బాబు ఇంతలా వెనక్కి తగ్గి.. ఎమ్మెల్యే స్ధానాలన్నీ ఇచ్చేస్తానని ప్రాథేయపడటం.. అమరావతిని తన బ్రెయిన్ చైల్డ్ గా ఫీలవుతున్నారని అర్ధమవుతోంది. ఎలాగైనా దానిని బతికించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది.
అందరం రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్దామనేది మొదటి సవాల్. రెండోది సవాల్ కాదు… రిక్వెస్ట్ అనే చెప్పాలి. వైసీపీ నేతలు టీడీపీ వారినే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి తేల్చుకోండని కౌంటర్ ఇస్తే… సరే అలాగే మేమే రాజీనామా చేస్తాం.. మీరు అమరావతిని కొనసాగించండి.. ఆ స్థానాలను మీకే అప్పచెబుతాం అని చంద్రబాబు చెప్పారంటే.. ఎంత పెద్ద విషయం.. ఉన్నవే 23..అయితే అందులో ముగ్గురు ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చారు. ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారని తెలుస్తోంది. అలాంటి ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యే స్థానాలు పోతే.. అసెంబ్లీలో ఇక టీడీపీకి ప్రాతినిధ్యం ఉండదు… వైసీపీదే వన్ సైడ్ అసెంబ్లీ అయిపోతుంది. బహుశా.. వైసీపీ ఎటూ అమరావతికి ఒప్పుకోదు కాబట్టి.. అలాంటి మాట చంద్రబాబు చెప్పి ఉండొచ్చు. అయినా అంత ముందుకు వెళ్లారంటే.. ఆశ్చర్యమే మరి. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఈ విషయాన్ని బాగా ప్రచారంలోకి తెస్తే.. కనీసం కాస్తయినా ప్రయోజనం దక్కుతుంది. లేదా వైసీపీ నేతలు కౌంటర్ చేసినా.. కూడా దక్కుతుంది. అలా అయినా బాబు గారి పంచ్ కు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.