కిక్కు కోసం శానిటైజర్ సైతం తాగేసి.. ప్రాణాలు పోగోట్టుకుంటున్నవారిని చూస్తే.. డీఎడిక్షన్ సెంటర్లు పెడతానన్నారు కదా.. ఏమైపోయాయా అనే ప్రశ్న వస్తోంది. మద్యపాన నియంత్రణ కమిటీని ఒకదానిని వేశారు కదా.. అదేం చేస్తుంది అనే ప్రశ్న వస్తోంది. దానికో ఛైర్మన్ ని కూడా పెట్టారే.. వారి బంటు లక్ష్మణ్ రెడ్డి అని.. ఆయనేమయ్యాడా అనే డౌటు కూడా వస్తుంది. కనీసం ప్రకటన చేసేంత పరిస్ధితిలో కూడా లేదా కమిటీ అనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు మద్యపాన నిషేధాన్ని ఎలా అమలు చేయగలరు వీరు? అసలు మద్యపాన నిషేధం కేవలం కొన్ని నెలలు విధిస్తారు.. ఎన్నికలకు ముందు.. మళ్లీ ఎన్నికలు అయిపోయాక.. అంతా మామూలే కదా.. అది కూడా మీకు తెలియదా అని కొందరంటుంటే.. అవునేమో అనిపిస్తోంది.
ప్రకాశం జిల్లాలో 20 మంది చనిపోతే.. ఇప్పుడు కడప జిల్లాలో మరో ముగ్గురు చనిపోయారు. వీరంతా శానిటైజర్ తాగి చనిపోతున్నారు. వీరు శానిటైజర్ ఎందుకు తాగారంటే.. మందు దొరక్క అది తాగేశారని చెబుతున్నారు. ఇక కొన్ని చానెళ్లు అయితే.. మందు దొరక్క కాదు.. ఆ రేటు పెట్టలేక.. శానిటైజర్ కొనుక్కుని తాగుతున్నారని చెబుతున్నాయి. రెడ్ జోన్స్, కంటైన్ మెంట్ జోన్స్ లో మందు షాపులు తెరవటం లేదు.. అక్కడి వారంతా వేరే గ్రీన్ జోన్ లో తెరిచి ఉన్న వైన్ షాపులకు వెళుతుంటే.. లోకల్ మహిళలంతా కరోనా వ్యాపిస్తుందంటూ ఆందోళన చెంది.. తిరగబడుతున్న ఘటనలు కూడా మనం చూశాం.
మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తామంటూ..అందుకు తగ్గ కార్యాచరణ ఇదుగో అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశంలో లిస్టు ఇచ్చేశారు. అప్పుడే కమిటీని ఏర్పాటు చేశారు. షాపుల సంఖ్య తగ్గించేస్తామని.. డీఎడిక్షన్ సెంటర్లు ఎక్కడికక్కడ పెడతామని అప్పుడు చెప్పారు. ఇప్పటికీ పెట్టలేదు. ఒక పక్క వైన్ షాపులు ప్రభుత్వమే నిర్వహిస్తూ.. అందులో రెగ్యులర్ బ్రాండ్స్ కాకుండా.. ఏవేవో బ్రాండ్స్ అమ్ముతుంటే.. జనం గొడవ చేశారు. అందుకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. మద్యనిషేధం విధించాలని చూస్తుంటే.. ఆ బ్రాండ్ ఇవ్వటం లేదు.. ఈ బ్రాండ్ ఇవ్వటం లేదని గొడవేంటి అంటూ ఎదురు ప్రశ్న వేశారు. కానీ ఆ బ్రాండ్లు అన్నీ వీరి మనుషులవేనని.. చక్కగా బిజినెస్ చేసుకుంటారని తెలిశాక అందరూ నోరు తెరిచారు. ఇప్పటికీ అదే నడుస్తోంది.
పైగా ఆ బ్రాండ్ల రేట్లు ఇష్టమొచ్చినట్లు పెట్టుకుంటున్నారు. అదేమంటే.. తాగుబోతులను నిరుత్సాహపర్చాలి కదా.. అందుకే రేట్లు పెంచామని.. రేట్లు తగ్గించి.. అందరినీ తాగబోయాలా అంటూ దబాయిస్తున్నారు. పోనీ రేటు ఎక్కువైందనో.. దొరకడం లేదనో.. తాగుబోతులు ఇబ్బందులు పడుతున్నట్లు.. వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలి కదా.. అసలు అలాంటోళ్లు ఎంతమంది ఉన్నారో గుర్తించే వ్యవస్ధ ఉందా మనకి? గుర్తించి వారిని ఒక చోటకు చేర్చి.. డీఎడిక్షన్ ట్రీట్ మెంట్ ఇచ్చే మనుషులు ఉన్నారా మనకి? లేరు. మరి మనమిష్టమొచ్చినట్లు.. అన్నీ చేసుకుంటూ పోతే.. ఎవడికి వాడు శానిటైజర్లు తాగేసి ప్రాణాలు తీసేసుకుంటుంటే.. అదేదో యాక్సిడెంట్ అన్నట్లు పట్టించుకోవడమే మానేస్తున్నారు. 23 మంది చనిపోతే… ముఖ్యమంత్రి అన్నోడు అసలు దాని గురించి ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వకుండా ఉన్నాడంటే.. ఏమనుకోవాలి?
ఇవన్నీ చూస్తుంటే.. చెప్పేటందుకు, రాసేటందుకే తప్ప.. ఏ విధానాలు అమలు చేసేటందుకు కాదేమో అనిపిస్తోంది. విలువలు, విశ్వసనీయత ఇలాంటివన్నీ ప్రాస కోసమే తప్ప.. నిజానికి జనం కోసం కాదని అర్ధమవుతోంది. మద్యపాన నిషేధాన్ని అనేకమంది సమర్ధిస్తున్నారు. చిత్తశుద్ధితో అమలు చేస్తే.. జనానికి మేలే చేస్తుంది. దాన్ని కూడా కేవలం పేరుకు పెట్టి.. ఆ పేరుతో సైతం డబ్బులు వసూలు చేసుకుంటున్న వైనం చూస్తుంటే ఏమనాలో అర్ధం కావడం లేదు. ఇప్పటికైనా డీఎడిక్షన్ సెంటర్లు పెట్టి.. మందుకు బానిసలైనవారి ప్రాణాలను కాపాడండి.. బ్రాండ్లు, రేట్లు అనే జిమ్మిక్కులు మానేసి.. వీలైన వరకు షాపులను మూసేయండి. అసలైన మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేయండి. అవన్నీ కుదరదంటే.. ఇక తమరిష్టం.