బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొన్ని అంశాల్లో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చింది. స్వాతంత్ర్యోద్యమంలో పోరాటం చేసి.. ఈ తరం వారికి తెలియకుండా కనుమరుగైపోయిన వారికి గుర్తింపు కల్పిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గణతంత్ర వేడుకల విషయంలో ఈ ఏడాది నుంచి సరికొత్త విధానం అమలు చేయనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు కీలక విషయాలను వెల్లడించాయి.
ప్రతీ ఏడాది 26న జరిగే గణతంత్రవేడుకలను ఈ ఏడాది నుంచి జనవరి 23 నుంచే ప్రారంభం కానున్నాయి. జవనరి 24న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. కనుక ఆయన జయంతి ఉత్సవాలను కూడా గణతంత్రదినోత్సవ వేడుకల్లో భాగంగా జరుపుతూ ఆయనకు గౌరవాన్ని కల్పించడం కేంద్రం ఉద్దేశ్యం. ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం జనవరి 23 నుంచే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించనున్నారు.
భారత చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను స్మరించుకోవడంపై ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఇందులో భాగంగా సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివాస్‌గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 14న దేశ విభజన సంస్మరణ దినోత్సవంగానూ, అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దివాస్‌గా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పుడు తాజాగా పరాక్రమ్ దివాస్ జరపనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నేతాజీ కుటుంబ సభ్యులు స్వాగతించారు.
ఢిల్లీలో 26న జరిగే గణతంత్ర వేడుకలకు కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం 24 వేల మందికి అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది కూడా 25 వేల మందికి అనుమతించారు. సాధారణంగా రిపబ్లిక్ వేడుకల్లో సుమారు లక్షా 25 వేల మంది వరకు పాల్గొంటారు.