– దేశమంతా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
– కర్తవ్య పథ్ లో జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి
– కలిసి కట్టుగా ముందుకు వెళ్దామన్న ప్రధాని
దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కర్తవ్య పథ్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చిన తర్వాత తొలిసారి జరిగిన గణతంత్ర వేడుకల్లో పరేడ్ ఆకట్టుకుంది.
త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు రాష్ట్రపతి. జాతీయ గీతం ఆలపించిన తర్వాత 21 గన్ సెల్యూట్ స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్, ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు పరేడ్ సాగింది. త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆత్మనిర్భర్ భారత్ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్, నాగ్ క్షిపణి వ్యవస్థ, కే-9 వజ్రాను పరేడ్ లో ప్రదర్శించారు.
ఇక.. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘భారతీయులు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సమయంలో జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవం విశిష్టమైనది. దేశం కోసం అసువులుబాసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు ప్రధాని.