అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నిక ఫలితం తేలిపోయింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ స్పీకర్ పదవిని దక్కించుకుంది. కెవిన్ మెకార్టీని సభాపతిగా ఎన్నుకునేందుకు రిపబ్లికన్లు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 15వ రౌండ్ ఓటింగ్ పూర్తయిన తర్వాత మెకార్టీ స్పీకర్ గా గెలిచినట్టు ప్రకటించారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత 15వ రౌండ్ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో కెవిన్ మెకార్థీకి 216, అధికార పార్టీకి చెందిన హకీమ్ సెకౌ జెఫ్రీస్‌కు 212 ఓట్లు వచ్చాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ రౌండ్‌లో నాలుగు ఓట్లతో మెకార్టీ గెలిచినట్టు క్లర్క్ చెర్లి జాన్సన్ ప్రకటించారు.
దీంతో రిపబ్లికన్లు హర్షధ్వానాలతో సభ దద్దరిల్లిపోయింది. అమెరికా స్పీకర్ ఎన్నికల చరిత్రలో ఈ ఎన్నికల ఐదో అతి సుదీర్ఘ పోటీగా నిలిచింది. అమెరికా చరిత్రలో 1855లో అత్యధికంగా రెండు నెలల పాటు 133 రౌండ్ల ఓటింగ్ కొనసాగిన తర్వాత స్పీకర్ ఎన్నిక ముగిసింది.