అమర్ నాథ్ క్షేత్రం సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరో 40 మంది గల్లంతయినట్లు చెప్పారు. వర్షం పడుతున్నా.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 100 మంది సహాయక బృందాలు రెస్క్యూ పనిలో ఉన్నాయి. ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
ప్రాణనష్టంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర బలగాలను, జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అడ్మినిస్ట్రేషన్ నాలుగు హెల్ప్ లైన్ నంబర్ లను ఏర్పాటు చేసింది.
అకస్మాత్తుగా వచ్చిన వరదలతో అమర్ నాథ్ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. గల్లంతయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమర్ నాథ్ గుహ దగ్గర రెండు శునకాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
వరద బీభత్సం నుంచి దాదాపు 15 వేల మంది యాత్రికులను సురక్షితంగా కాపాడామని తెలిపారు ఐటీబీపీ జవాన్లు తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఆర్మీ హెలికాప్టర్లలో అమర్ నాథ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.