రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో పర్యాటక బోటు మునిగిన విషాద ఘటనలో ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశారు. సోమవారం నాటికి 8 మృతదేహాలను గుర్తించగా, మంగళవారం ఉదయం మరో ఎనిమిది మృతదేహాలు లభ్యం అయ్యాయి. రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, 50 మంది గజ ఈతగాళ్ళతో గోదావరిలో గాలింపు కొనసాగుతోంది. గోదావరి ప్రవాహ వేగానికి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, పట్టిసీమ, కాపర్ డ్యామ్ వైపు మృతదేహాలు కొట్టుకుపోయి ఉంటాయని అధికారుల అంచనా వేస్తున్నారు. నేవీ రెస్య్కూ సిబ్బంది, ఉత్తరాఖండ్ నుంచి దేవీపట్నం వచ్చిన రెస్క్యూ బృందాలు గాలింపు చర్యల్లోె నిమగ్నమయ్యాయి. కచ్చులూరు గోదావరి దగ్గర గల్లంతైన బోటు లోకేషన్‌ను గుర్తించారు. అధునాతనమైన సైడ్ స్కాన్ సోనార్ పరికరంతో ఎంత లోతులో ఉన్న బోటునైనా వెతికి పట్టుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. బోటులోనే అనేక మృతదేహాలు వుండివుంటాయని భావిస్తున్నారు. బోటు గోదావరిలో 320 అడుగుల లోతులో ఉందని అధికారుల ప్రాధమిక అంచనా. చత్తీస్‌గఢ్డ్, జార్ఖండ్ ప్రాంతాలకు చెందిన పులువురు నిపుణల సహాయంతో బోటు ఉన్న అడుగు భాగం 300 అడుగుల లోతు వరకు లోపలికి వెళ్లే ప్రయత్నాల్లో అధికారులు వున్నారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను గుర్తించారు. ఇంకా, 32 వరకు మృతదేహాల అచూకీ లభ్యం కావాల్సివుంది. సైడ్ స్కాన్ సోనర్ సహాయంతో బోటు మునిగిన ప్రాంతాన్ని గుర్తించారు. ఇలావుంటే, గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట పున్నమి బోటుకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచే అనుమతులు వచ్చాయని తేలింది.