గోదావరిలో బోటు వెలికితీత చర్యలను అధికారులు నిలిపివేశారు. నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇతర బృందాలు తిరిగి వెళ్లిపోయాయి. బోటు ప్రమాదంలో ఇంకా 16మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కచ్చులూరు పరిసరాల్లో 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన నిపుణుల బృందం బోటు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, దానిని తీయడానికి ప్రయత్నించి, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కొద్ది రోజులు ఆగాలి అని తేల్చి చెప్పింది. మరోపక్క బోటు ప్రమాద విషాదం నుంచి జనం ఇప్పటికీ తేరుకోలేదు. బాధిత కుటుంబాలైతే ఇంకా ఆ ఘోరాన్ని తలచుకుని విలపిస్తూనే ఉన్నాయి. తమ ఆప్తుల మృతదేహాలు కళ్లిన స్థితిలో చూసి బాధితులంతా శోకసంద్రం అయ్యారు. ఇప్పటికీ ఆచూకీ తెలియని వారి సంగతైతే చెప్పడానికి మాటలు కూడా ఉండవు. కొందరు ప్రమాద ప్రాంతంలోను, మరికొందరు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోను తమ వారి జాడ కోసం వేయి కళ్లతో రోజుల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆరు రోజులు గడిచిపోయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో చివరి చూపైనా దక్కుతుందనే ఆశ సన్నగిల్లిపోతోంది. అయినా ఆశ చావక ప్రభుత్వాసుపత్రి ముందే తచ్చాడుతున్నారు.
రాజమహేంద్రవరం: బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 34 మృత దేహాలను గుర్తించారు. బోటు వెలికితీత మావల్ల కాదంటూ ఎక్కడివారు అక్కడ సర్ధుకున్నారు. శుక్రవారం మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం గోదావరిలో తేలింది. ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తీసుకువచ్చారు. చెవి దిద్దులు, కాళ్ల పట్టీల ఆధారంగా ఆ మృతదేహం విశాఖపట్టణం మహరాణిపేటకు చెందిన మధుపాక అరుణకుమారి (30)గా ఆమె బంధువులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు గల్లంతైన వారిలో 35 మందిని పోలీసులు గుర్తించారు. అంతకుముందు మరో రెండు మృతదేహాలను గుర్తించినా వాటిని ఈ ఘటనతో సంబంధం లేనివిగా తేల్చారు.
బోటు డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణ, హైదరాబాద్‌కు చెందిన జనరల్ స్టోర్స్ నిర్వాహకుడు పవన్ కుమార్, అతని భార్య వసుంధర భవాని, విశాఖపట్టణానికి చెందిన నలుగురు, మంచిర్యాలకు చెందిన ట్రాన్స్‌కో ఇంజనీర్ రమ్యశ్రీ, పట్టిసీమకు చెందిన బోటు హెల్పర్ కర్రి మణికంఠ, నరసాపురానికి చెందిన చట్లపల్లి గంగాధర్, వరంగల్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన బస్కీ ధర్మరాజు, కొమ్ముల రవి, కొండూరి రాజ్‌కుమార్, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆరు ఏళ్ల విఖ్యాతరెడ్డి తదితరుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.