యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఓ టెక్నాలజీ ప్రాణాలు కాపాడుతోంది. రెండు రోజుల క్రితం అమెరికాలో అలస్కాలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. యాపిల్ తీసుకు వచ్చిన సాస్ టెక్నాలజీ సహాయంతో ఆయన తన ప్రాణాలుతో బయటపడ్డాడు.
14 శాటిలైట్ ద్వారా అతని ఐ ఫోన్ సాస్ మెసేజ్ అలర్ట్‌ను ఎమర్జెన్సీ సర్వీస్‌కు పంపించింది. దీంతో అతన్ని కాపాడారు. జీపీఎస్ సహాయంతో యాపిల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ అతని ఆచూకీని కనిపెట్టింది. ఆ వ్యక్తి 69 డిగ్రీల అక్షాంశాల దగ్గర ఉన్నట్టు రెస్పాన్స్ సెంటర్ గుర్తించింది.
దీంతో స్థానిక అధికారులు, రెస్క్యూ టీం, కొంతమంది వాలంటీర్ల సాయంతో అతడు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి అతన్ని అధికారులు సురక్షితంగా తీసుకొచ్చారు. అయితే తనకు తానుగా అతను అక్కడ ఉండి పోవడానికి ఓ కారణం వుంది.
ఐఫోన్ నూతనంగా తీసుకొచ్చిన ఎమర్జెన్సీ సాస్ అలర్ట్ ఫీచర్ పనిచేస్తోందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 1న స్నో మొబైల్ లేదా మోటార్ స్లెడ్ మీద నూర్విక్ నుంచి కొట్జ్‌బు ప్రాంతానికి వెళ్తూ అలస్కాలో ఒక చోట ఆగాడు.
ఆ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ రాలేదు. దాంతో, శాటిలైట్ సాయంతో అతని ఐ ఫోన్ సాస్ మెసేజ్ అలర్ట్‌ను ఎమర్జెన్సీ సర్వీస్‌కు పంపించింది. దీంతో అతడిని అధికారులు కనిపెట్టారు. సాస్ ఫీచర్‌ను పరీక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టడం ఏంటంటూ? నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు యాపిల్ సాస్ ఫీచర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
62 డిగ్రీల అక్షాంశాలు దాటితే సాస్ వ్యవస్థ పనిచేయదని గతంలో యాపిల్ ప్రకటించింది. కానీ, ఈ వ్యక్తి చిక్కుకున్న 69 డిగ్రీల అక్షాంశాలలోనూ సాస్ అలర్ట్ సిస్టం పనిచేసింది. ఐఓఎస్ 16.1 అప్‌డేట్‌లో భాగంగా ఎమర్జెన్సీ సాస్ మెసేజ్, వాయిస్ కాల్ అలర్ట్‌ను యాపిల్ తీసుకొచ్చింది.