– నాలుగు నెలలుగా నో శాలరీ
– రెండు రోజులుగా రెసిడెంట్ డాక్టర్ల నిరసన
– 29 సర్కార్ దవాఖానాల్లో విధుల బహిష్కరణ
– ప్రభుత్వం స్పందించపోతే ఉద్యమమే..
– డాక్టర్ల హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా 698 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. జీతాల కోసం నిరసనకు దిగారు. నాలుగు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా సహా మొత్తం 29 సర్కార్ దవాఖానాల్లో ఇదే పరిస్థితి.
వెంటనే తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు రెసిడెంట్ డాక్టర్లు. ప్రస్తుతం ఓపీ, ఐపీ సేవలనే బహిష్కరించారు వీరంతా. ప్రభుత్వం స్పందించకపోతే శుక్రవారం నుంచి ఎమర్జెన్సీ డ్యూటీలకు కూడా హాజరు కాబోమని చెబుతున్నారు. జీతాలు రాక తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్లు.
వీరి నిరసనతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ప్రొఫెసర్లు, ప్రధాన వైద్యాధికారులంతా నిరసన బాట పట్టడంతో రోగులు ఇతర ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. రెండు రోజుల నుంచి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. జులై 2 నుంచి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కరోనా సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు వైద్యం చేస్తే ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడం ఏంటని మండిపడుతున్నారు డాక్టర్లు. తమను మనోవేదనకు గురిచేయొద్దని వేడుకుంటున్నారు.