తన అనుచరుల్ని కాదు, దమ్ముంటే తనని సస్పెండ్ చేయమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. దమ్ముంటే పొంగులేటి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. పార్టీలో ఉంటే ఉండండి, లేకపోతే రాజీనామా చేయండని చెప్పిన ఆయన.. వ్యక్తులపై బీఆర్ఎస్ పార్టీ ఆధారపడదని కౌంటర్ ఇచ్చారు.
ఖమ్మం జిల్లా రాజకీయాలు పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయన్నారు. వైరాలో అభ్యర్థులు ఉండగానే.. మరో అభ్యర్థిని ఎలా ప్రకటిస్తావంటూ నిలదీశారు. వైరాలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తన బాధ్యత అని తెలిపారు. డిసెంబర్ 31 వ తేదీ వరకు అభివద్ధి పనులు కొనసాగాయని.. జనవరి ఒకటో తారీఖు నుంచి అభివృద్ధి ఆగిపోయిందా.. అని ప్రశ్నించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గాలే వీస్తుందని, జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తుందని పువ్వాడ అజయ్ ధీమా వ్యక్తంగా చేశారు. బీఆర్ఎస్ పార్టీ జెండా వదిలేస్తే, తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందని పొంగులేటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ బీఫామ్ తీసుకొని,పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని సస్పెండ్ చేస్తామని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ ఇలాంటి ఉడత ఊపులకు భయపడే మనిషి కాదన్నారు.
కేసీఆర్ కు నమ్మంగా ఉన్నవాళ్ళే బీఆర్ఎస్ లో ఉండాలని, లేకపోతే పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లిపోండని అన్నారు. కేసీఆర్ కి తాను చెప్పే వచ్చిన వైరా నియోజకవర్గాన్ని గెలిపించే బాధ్యత తనదే అని తెలిపారు. వైరా మున్సిపాలిటీకి విశ్వాస తీర్మానం పెట్టామన్నారు. మేము పెట్టిన కూడే కదా, తినండి, ఎన్ని రోజులు ఆ పదవుల్లో ఉంటారో ఉండండని ఎద్దేవా చేశారు. కాగా.. సీఎం కేసీఆర్ పై తిరుగుబాటు చేసిన వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వాళ్లను,వీళ్లను కాదు దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.