75వ స్వాతంత్ర్యదినోత్సవ వేళ.. జాతిపిత మహాత్మాగాంధీకి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ను గాంధీకి ఇస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శాంతి, అహింస మార్గాల్లో గాంధీ నడిపిన ఉద్యమాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయని, ఎంతో మందిని ప్రభావితం చేశాయని అమెరికా ప్రతినిధుల సభ కొనియాడింది. జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ నుంచి నెల్సన్ మండేలా వరకూ.. గాంధీని ఆదర్శంగా తీసుకునే తమ హక్కుల కోసం పోరాడరని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అమెరికాలోనే అత్యున్నత పౌర పురస్కారం. భారతదేశం నుంచి ఈ గౌరవాన్ని అందుకుంటున్న మొదటి వ్యక్తి గాంధీనే. గతంలో జార్జి వాషింగ్టన్, నెల్సన్ మండేలా, జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ , మదర్ థెరిస్సా, రోసా పార్క్స్ వంటి మహనీయులకు ఈ గౌరవం లభిచింది.