హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. దొంగ అనుకొని ఓ వ్యక్తిపై నలుగురు దాడి చేయడంతో మృతి చెందిన ఘటన ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. కేపీహెచ్‌బీ కాలనీలో మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ సిబ్బంది చేసిన దాడిలో రాజేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. బుధవారం అర్థరాత్రి రాజేశ్ బిర్యానీ కోసం రెస్టారెంట్ సెల్లార్‌లోకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న నలుగురు రెస్టారెంట్ సిబ్బంది మద్యం మత్తులో రాజేశ్ ను దొంగ అనుకొని దాడి చేశారు.
గాయాలతో ఉన్న రాజేశ్ ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. తరువాత రోజు ఉదయం రాజేష్ భార్యకు విషయం తెలియడంతో ఇంటికి తీసుకొని వెళ్లింది. భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో రాజేశ్ మృతి చెందాడు. తరువాత మృతుడి భార్య కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాడి చేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.