సౌదీ అరేబియాలో ఓ రెస్టారెంట్ లో అధికారులు తనిఖీ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ రెస్టారెంట్ లో గత ముప్పై ఏండ్లుగా సమోసాలను టాయిలెట్ లో తయారు చేస్తున్నట్టు తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.
సౌదీలో ఆ రెస్టారెంట్ చాలా ఫేమస్. నిత్యం వేలాది మంది ఆ రెస్టారెంట్ కు వచ్చి తమకు కావాల్సినవి తిని వెళుతుంటారు. అయితే ఇటీవల సమోసాలు, స్నాక్స్ ను టాయిలెట్ లో తయారు చేస్తున్నట్టు కొందరు స్థానికులు గుర్తించారు.
ఈ విషయాన్ని జెద్దా మున్సిపాలిటీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో రెస్టారెంట్ సిబ్బంది సమోసాలు, మీల్స్ సహా ఎన్నో ఐటమ్స్ ను టాయిలెట్ లో తయారు చేస్తూ కనిపించారు.
ఇక రెస్టారెంట్ లో దాదాపు రెండేండ్ల క్రితం నాటి మాంసం, జున్నును ఉపయోగించడం చూసి అధికారులు విస్తుపోయారు. ఆ పక్కనే ఎలుకలు పరుగెత్తుతుండటం, పురుగులు పారడం, కీటకాలు ఎగరడం కనిపించాయి. ఇక అక్కడ పనిచేసే సిబ్బందికి కనీస హెల్త్ కార్డులు లేవని అధికారులు తెలుసుకున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆ రెస్టారెంట్ ను అధికారులు సీజ్ చేశారు.
ఇటీవల జెడ్డాలోని ఓ షవర్మా రెస్టారెంట్ నూ ఇలాంటి కారణాలపైనే అధికారులు మూసివేశారు. తనిఖీలు చేస్తున్న సమయంలో రెస్టారెంట్ లో ఓ స్కేవర్ పైన మాంసం తింటున్న ఎలుక ఒకటి అధికారులకు కనిపించింది. దీన్ని గమనించి ఓ కస్టమర్ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.
ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. రెస్టారెంట్ లో కనీస పరిశుభ్రతను కూడా పాటించకపోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి రెస్టారెంట్ యాజమాన్యానికి షాక్ ఇచ్చారు.