భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎస్ఐ పనిచేసే పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు నమోదైంది. మాజీ కలెక్టర్ ఆకునూరి మురళీ దగ్గరుండి మరీ ఫిర్యాదు చేయించారు. స్థానిక సీఐ, డీఎస్పీతో మాట్లాడిన మురళీ.. యువకుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్‌ఐపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా శుక్రవారం.. భూపాలపల్లికి చెందిన కూనారపు భిక్షపతి అనే యువకుడు రాంగ్ రూట్ లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అది గమనించిన స్థానిక ఎస్ఐ రామకృష్ణ అతడిని ఆపి లాఠీతో కొట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న భూపాలపల్లి మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి అది గమనించి, తన వాహనాన్ని ఆపారు. ఎస్ఐ వద్దకు వెళ్లి ఎందుకు కొట్టారని ప్రశ్నించారు.
పౌరుల్ని కొట్టే హక్కు మీకెక్కడిదని నిలదీశారు. తమషా అనుకుంటున్నారా ? ఏ రాజ్యంలో ఉన్నాం! ఇండియాలోనే ఉన్నామా ? అంటూ యనిఫామ్ లో లేని ఎస్ఐ పై మండిపడ్డారు. అనంతరం యువకుడికి ఎస్ఐ రామకృష్ణతో సారీ చెప్పించారు.
యువకుడికి క్షమాపణలు చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోయినా.. ఆకునూరి మురళీ మాత్రం ఆ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టలేదు. భిక్షపతితో కలిసి నేరుగా ఎస్ఐ రామకృష్ణ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ స్టేషన్ కే వెళ్లి ఆయనపైనే ఫిర్యాదు చేయించారు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.