కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని ఎస్డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి అన్నారు. ఇవాళ భౌగోళిక తెలంగాణ వచ్చిందిగాని సామాజిక తెలంగాణ రాలేదన్నారు. మంచిర్యాలలో చార్వక ట్రస్ట్ హాల్లో నిర్వహించిన ‘ సామాజిక తెలంగాణ – ప్రత్యామ్నాయ రాజకీయాలు ‘ సదస్సు లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ… సామాజిక తెలంగాణ సాధించుకున్నప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీలకు, మహిళలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు సాధించుకోవాల్సింది సామాజిక తెలంగాణ అని తెలిపారు. రాజకీయాన్ని సీఎం కేసీఆర్ ఒక పెద్ద వ్యాపారం చెశాడన్నారు.
అవినీతిని సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నాడని ఆరోపించారు. వేల కోట్ల అవినీతికి కేసీఆర్ తెరలేపాడని విమర్శించారు. ఈ రోజు రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన వల్ల 50 లక్షల మంది రైతులు, 20 లక్షల మంది కౌలు రైతులు, 40 లక్షల మంది రైతు కూలీలు,ఉపాధి కూలీలు, 30 లక్షల మంది నిరుద్యోగులు, 35 లక్షల మంది విద్యార్థులు, 20 లక్షల మంది ఇండ్లు లేని వారు అరిగోస పడుతున్నారన్నారు.
తెలంగాణ లో కావాల్సినంత సంపద ఉన్నప్పటికీ మంచి బడులు, మంచి కాలేజీలు, మంచి ఆస్పత్రులు లేవన్నారు. ఎన్నికలంటే వందల కోట్లు ఉంటేనే పోటీ చెయ్యాలనే వ్యవస్థను కేసీఆర్ తీసుకు వచ్చారని ఆరోపించారు. మనం నిజమైన బంగారు తెలంగాణను నిర్మించుకోవాలంటే ప్రత్యామ్న్యాయ రాజకీయాలు నిర్ణయించుకోవాలన్నారు. అవసరమనుకుంటే సామాజిక తెలంగాణ కేంద్రంగా ఒక కొత్తపార్టీ ని పెట్టుకోవాలని అన్నారు.