రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు థర్డ్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాన్ని వదిలేసి దేశ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల సీఎంలను కలవడం ఆ విమర్శలకు బలం చేకూర్చేలా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తొలివెలుగుతో ముచ్చటించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పోకడలను అమలు చేస్తోందని అన్నారు. తెలంగాణలోని ఐఏఎస్ అధికారులకు రాష్ట్రంలో స్థానంలేకుండా చేశారని కేసీఆర్ పై మండిపడ్డారు. స్థానిక ఐఏఎస్ అధికారులను చిన్న చూపు చూస్తూ.. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఎస్ఎస్ అధికారులను ముందు పెడుతున్నారని ఆరోపించారు.
కుల వ్యవస్థను ఆధారంగానే దళిత అధికారులను ప్రాధాన్యత లేని పదవుల్లో నియమిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లను అనుసరించడంలో రాజ్యంగ వ్యతిరేక కార్యకలాపాలతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. చట్ట ప్రకారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన విధంగానే పేదలకోసం ఖర్చు పెట్టాలని అన్నారు.
కానీ,, అవసరం లేని చోట ఎస్సీ, ఎస్టీల కోటాలోని బడ్జెట్ ను ఖర్చు చేస్తూ.. దళిత సామాజిక వర్గాన్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీ చట్టానికి కేసీఆర్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వ్యాఖ్యానించారు. జిమ్మిక్కుల మాటలతో కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. కేవలం ఓట్ల కోసం పేదరికాన్ని వాడుకుంటారు తప్పితే.. పేదల కష్టాలు మాత్రం వారికి కనిపించట్లేదని అన్నారు. రాజ్యంగంలో సవరణలు చేసుకోవచ్చు అనే కనీస పరిజ్ఙానం కూడా లేని కేసీఆర్.. రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటం మూర్ఖత్వం అని అన్నారు.
60 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు కొత్త రాజ్యాంగాన్ని రాయాలని అనడం తప్పు అని తెలియదా అని ప్రశ్నించారు మురళి. ఈ నెల 7 నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అందరికి సమాన విద్య అందేలా కొత్త చట్టాన్ని ప్రవేశ పెడితే రాష్ట్రంలోని ప్రతీ పేద వారికి న్యాయం చేసినట్టే అని అన్నారు ఆకునూరి మురళి.