ఏలూరును వణికిస్తున్న వింత వ్యాధి ముప్పు విశాఖపట్నంకు కూడా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ ద్వారా హెచ్చరించారు. విశాఖ నగరంలోనూ నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని, మున్సిపాలిటీలతో పాటు రాష్ట్రంలోని కార్పోరేషన్లలో మంచినీటి వనరులు, పైపులైను వ్యవస్థలు, పైపులైన్లకు వినియోగించే పైపుల నాణ్యత అంశాలన్నీ నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని లేఖలో ప్రస్తావించారు.
దేశంలో మొత్తం 26నగరాల్లో మోతాదుకు మించిన సీసంతో కలుషితమైన నీరు సరఫరా అవుతుందని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన అధ్యయనంలో వెల్లడైందన్నారు. సీసం పూతతో తయారైన పైపుల వినియోగం కూడా నీరు విషంగా మారటానికి కారణం అవుతుందని ఆయన హెచ్చరించారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయించాలని కోరారు.
ఈ లేఖను ఈఏఎస్ శర్మ సీఎం జగన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులకు కూడా పంపించినట్లు తెలుస్తోంది.