ఏపీలోని అనంతపురం నుంచి కియా కార్ల కంపెనీ తమిళనాడుకు తరలిపోతుందని…తమిళనాడు ప్రభుత్వంతో కియా కార్ల కంపెనీ ఈ విషయంపై చర్చలు జరుపుతున్నట్టు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్లు చేసింది. ఇదే విషయాన్ని మొదటి సారిగా రాయిటర్స్ వెల్లడించడంతో ఈ వార్త సంచలనంగా మారింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా అదంతా ఉత్తుత్తి వార్త అని…అలాంటిదేమి లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కియా కార్ల కంపెనీ ఎక్కడికి తరలిపోవడం లేదంటూ మీడియాలో ఊదరగొట్టింది. రాయిటర్స్ ప్రచురించిన వార్తను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. అయిత ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పో సందర్భంగా కియా మోటార్స్ ప్రతినిధులను రాయిటర్స్ సంప్రదించగా ప్లాంట్ తరలిపోతుందనే విషయాన్ని అంగీకరించినట్టు తెలిపింది. కియా ఎక్కడికి తరలిపోవడం లేదంటూ ఏపీ ప్రభుత్వ ప్రకటనను కూడా రాయిటర్స్ కియా ప్రతినిధుల దగ్గర ప్రస్తావించింది. తాము గతంలో ప్రచురించిన వార్తకు కట్టుబడి ఉన్నట్టు రాయిటర్స్ స్పష్టం చేసింది.
అధికార పార్టీ నేతలకు ఉచితంగా కార్లు, అనర్హులకు ఉద్యోగాలు, డీలర్ షిప్ లు ఇవ్వాలంటూ ప్రభుత్వం వేధిస్తుండడం వల్లనే కియా కార్ల కంపెనీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాధమిక చర్చలు జరిపినట్టు సమాచారం. తమిళనాడు ప్రభుత్వం కూడా కియా మోటార్స్ తమ రాష్ట్రానికి వస్తే ప్రోత్సకాలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. మరోవైపు కియా మోటార్స్ తమ రాష్ట్రానికి వస్తే ప్రోత్సకాలు ఇవ్వనున్నట్టు పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ ఏర్పాటుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేశారు.