తెలంగాణలో మరోసారి ట్వీట్ వార్ నడుస్తోంది. తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనను విమర్శిస్తూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ట్వీట్స్ చేశారు. వాటికి స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరికీ పలు ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పోరాడుతున్నప్పుడు రాహుల్ ఎక్కడున్నారని కవిత ట్వీట్ చేస్తే.. తెలంగాణ పాలనపై అధ్యయనం చేసేందుకు వస్తోన్న రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
దానికి స్పందించిన రేవంత్.. తనదైన శైలిలో కౌంటర్ వేశారు. రైతు వ్యతిరేక చట్టాలను ప్రధాని మోడీ తీసుకొచ్చినప్పుడు మీరెక్కడున్నారని రేవంత్ ప్రశ్నించారు. మోడీ ముందు మీ తండ్రి మోకరిల్లి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరి తాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడున్నారని ట్వీట్ చేశారు. అయినా అద్యయనం చేయడానికి మీరు ఏం చేశారని.. మీ పాలనపై ఏం అధ్యయనం చేయాలని ప్రశ్నించారు.
వరి, మిర్చి, పత్తి రైతులు ఎలా చస్తున్నారనే దానిపై అద్యయనం చేయాలా..? అని నిలదీశారు. రుణమాఫీ ఎలా ఎగ్గొట్టాలి.. ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి.. ఇవే కదా మీ ఆలోచనలని మండిపడ్డారు. ఇవే కదా నిజాలు.. వాటిని గట్టిగా చెప్పడానికే రాహుల్ వస్తున్నారు అని ట్వీట్ చేశారు. వాటితో పాటు.. కవిత చేసిన ట్వీట్ కు ట్యాగ్ చేస్తూ.. “చూసుకుని మురవాలి… చెప్పుకుని ఏడవాలి” అంటూ చేసిన ట్వీట్‌ను కవితకు ట్యాగ్ చేశారు రేవంత్ రెడ్డి.
“ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు..? వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఆయన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పంట వేసినప్పుడు మీరేం చేస్తున్నారు..? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిరప రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ఎక్కడ ఉన్నారు..? రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మీ తండ్రి పచ్చి మోసానికి ఒడిగడితే ప్రశ్నించాల్సిన మీరెక్కడ ఉన్నారు..? రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా ఇస్తామని మీ తండ్రి చెప్పి ఐదేళ్లవుతున్నా.. అర క్వింటాల్ ఎరువులు కూడా ఇవ్వలేదు.. అప్పుడు మీరెక్కడ ఉన్నారు…? అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం రాశులు తడిచి రైతులు బోరున విలపిస్తున్నప్పుడు.. వారి కష్టం పట్టించుకోకుండా మీరెక్కడ ఉన్నారు..?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి.