కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ ను ఆయన విడుదల చేశారు. మాటలు కోటలు దాటతాయి.. చేతలు మాత్రం గడప దాటవు అనే సామెత కేంద్రంలోని మోడీ సర్కార్ కు సరిపోతుందన్నారు. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు సంగతి అటుంచి మోడీ పాలనలో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయిందని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే.. ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ లక్షలాది మంది రైతులు రోడ్డెక్కారని.. ఆ ఉద్యమంలో 700 మందికి పైగా ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసి రైతుల నెత్తిన బరువు మోపారని.. బ్యాంకులను వేల కోట్లకు ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే.. అన్నదాతల రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. బీజేపీ-టీఆర్ఎస్ ఎనిమిదేళ్లు అంటకాగి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పథకాలన్నింటినీ విజయవంతంగా తుంగలో తొక్కారని అన్నారు రేవంత్. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ సెంటిమెంట్ డైలాగులే తప్ప తెలంగాణ ప్రజలు, రైతులు, యువత సమస్యల పరిష్కారానికి ఇచ్చిన మాట.. చేసిన పనీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతితో ఇప్పటికే వేల కోట్ల తెలంగాణ ప్రజల సంపద దోపిడీకి గురైతే… కేంద్రం చోద్యం చూస్తోందని విమర్శించారు. బొగ్గు స్కాం నుంచి భూముల స్కాం వరకు పలు ఫిర్యాదులు ఇచ్చినా స్పందించలేదని… ఇటీవల బీజేపీ కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారని గుర్తు చేశారు. రాష్ట్ర నాయకులేమో టీఆర్ఎస్ తో లడాయి అంటూ తొడలు కొడుతుంటారని.. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేస్తోన్న టీఆర్‌ఎస్, బీజేపీ చీకటి సంబంధం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయిందన్నారు.
అమిత్ షాకు రేవంత్ వేసిన ప్రశ్నలు
1. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి, రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారని మేం మొదటి నుండి ఆరోపిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఎటీఎంలా మారిందని… మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇటీవల పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి జరిగిందని అంగీకరిస్తున్న మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దేశంలో ప్రతిపక్ష నేతలు, మీ సొంత పార్టీలో నిజాలు మాట్లాడే నేతల పై ఈడీ, సీబీఐ ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే దాడులు చేయించే మీరు ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా?
2. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, కేసీఆర్ కలిసి మొదట ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారు. యాసంగి(2022) నుండి తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రభుత్వం చేయకూడదు అన్నది ఆ ఒప్పందం. దానికి రైతుకు సంబంధం లేని బాయిల్డ్ రైస్ అని ఒక వంక తెర మీదకు తెచ్చారు. దానికి అనుగుణంగానే కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారు. రైతుల వద్ద ధాన్యం కొంటుంటే ప్రభుత్వానికి రూ.7,000 కోట్ల నష్టం వచ్చిందని కుంటి సాకులు చెప్పారు. వరి వేస్తే ఉరే అని హెచ్చరికలు చేశారు. వరి వేస్తే రైతు బంధు ఇవ్వబోమని సంకేతాలు పంపారు. ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని అంగీకారం తెలుపుతూ 2021 అక్టోబర్ 4న మీ ఆదేశాల మేరకే FCI కి కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖపై క్షేత్ర స్థాయిలో “కల్లాల్లోకి కాంగ్రెస్” అని మేం పోరుబాట పట్టడంతో మాటమార్చారు. మీ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడచిన వానాకాలం నుండి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారు. ఈ మరణాలకు బాధ్యులు మీ రెండు పార్టీలు కాదా?
3. గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమాన్ని కించ పరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిపై టీఆర్ఎస్ మౌనం దాల్చినా కాంగ్రెస్ పక్షాన అప్పుడే మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదు అని మీరు భావిస్తున్నారా?
4. మీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆ మేరకు మీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. వీరిద్దరి మాటలు విశ్వసించిన ప్రజలు అరవింద్ ను ఎంపీగా గెలిపించారు. మూడేళ్లవుతున్నా పసుపుబోర్డు ఊసే లేదు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది ప్రజలను చీట్ చేయడం కాదా?
5. తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి బృహత్తర పథకాలకు కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం హామీ ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటికీ మంగళం పాడారు. తెలంగాణకు కేంద్రం పదే పదే రిక్తహస్తం చూపిస్తున్నా ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ అనేక సందర్బాల్లో మద్ధతిస్తూ వచ్చింది. ఇది బహిరంగమే. తెలంగాణ ప్రజలను నిలువునా వంచించిన బీజేపీ, టీఆర్‌ఎస్ ను మేం ఎందుకు నమ్మాలి. మీకు మా ప్రజలు మద్ధతు ఎందుకు ఇవ్వాలి? విభజన చట్టం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడు?
6. అయోధ్య నుండి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా “రామాయణం సర్క్యూట్” పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్ ప్రెస్ పేరిట రైలును ప్రవేశపెట్టారు. 7,500 కిలో మీటర్లు సాగే ఈ సర్క్యూట్ లో దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన మా భద్రాద్రి రాముడుకి చోటు దక్కలేదు. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కూడా మాకు మొండి చెయ్యి చూపారు. దీనికి మీ సమాధానం ఏమిటి? భద్రాద్రి రాముడు రాముడు కాదా? అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒక్కరు కాదా?
7. ఒడిశాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై మా పార్టీ సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నేను స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం. ఇంత వరకు దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్ అవినీతి విషయంలో మీరు నిజంగా అంత సీరియస్ గా ఉంటే… అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు?
8. పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదు. అడిగే బుద్ధి టీఆర్ఎస్ సర్కారుకు లేదు. పైగా మీ దుర్మార్గ చట్టాలకు వారి మద్దతు. వారి అక్రమాలు అవినీతికి మీ మద్దతు. ఇది కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది?
9. 2014లో మేం అధికారం నుండి దిగిపోయే నాటికి పెట్రోల్ ధర రూ.71.41, డీజిల్ ధర రూ.55.49. గ్యాస్ సిలిండర్ ధర రూ.470 ఉంది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.119.66, లీటర్ డీజిల్ ధర రూ.105.65. గ్యాస్ సిలిండర్ ధర రూ.1052 ఎగబాకాయి. మీరు అధికారంలోకి వచ్చాక దశల వారీగా గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ప్రతి రోజు ఉదయం పెట్రోలియం ధరల పెరుగుదల వార్తతోనే జనం జీవితాలు మొదలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ధరల పెరుగుదలతో జన చస్తుంటే మీకు చీమకుట్టినట్టైనా అనిపించడం లేదా? ఈ ధరల్లో 60 శాతం వరకు బీజేపీ-టీఆర్ఎస్ ప్రభుత్వాలు బాదుతున్న పన్నులే ఉన్నాయి. మీరు తగ్గించాలని వారు, వారు తగ్గించాలని మీరు డ్రామాలు చేయడం తప్ప… ప్రజలకు ఇద్దరు కలిసి ఇస్తున్న ఉపశమనం శూన్యం. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి?
తెలంగాణ ప్రజలు మోసానికి కవల పిల్లలు లాంటి బీజేపీ-టీఆర్ఎస్ జిత్తులు, ఎత్తులు గ్రహించలేని అమాయకులు కాదన్నారు రేవంత్. తమకు ఒపిక ఎక్కువని దానిని అమాయకత్వం అనుకుంటే పొరపాటు అవుతుందని చెప్పారు. సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర పోరాటం వరకు ప్రపంచానికే పోరాట పంథాను చూపిన తెగువగల ప్రజలు తెలంగాణ వాళ్లని వివరించారు. సెంటిమెంట్ తో ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయాలనుకునే మీ కుతంత్రం ఇక్కడ పని చేయదన్నారు.