– కేసీఆర్ ది అంతా నాటకం
– ఆయన మోడీ కోవర్టే..!
– యూపీఏ పక్షాలతోనే భేటీ ఎందుకు?
– ఎన్డీఏలోని పార్టీలను ఎందుకు కలవరు?
– కేసీఆర్ పై కోమటిరెడ్డి, రేవంత్ ప్రశ్నల వర్షం
ఇటీవలి కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ వచ్చింది.. గొడవలెందుకు.. మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. ఓవైపు బీజేపీతో కుమ్మక్కయి.. కేసీఆర్ కాంగ్రెస్ ను ఎదగనివ్వకుండా చేస్తున్నారని రేవంత్ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో అనేక అనుమానాలు తెరపైకొచ్చాయి.
రేవంత్ తో కోమటిరెడ్డి మళ్లీ చెడిందా? అనే చర్చ జరిగింది. అయితే.. అలాంటిదేం లేదని స్పష్టం చేస్తూ కోమటిరెడ్డి ఇంటికి వెళ్లారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. దానికి హ్యాపీ టైమ్స్ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్పందిస్తున్నారు. ఇలాగే కలిసి ముందుకెళ్దాం.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని కామెంట్స్ పెడుతున్నారు.
భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు చేశారు రేవంత్, కోమటిరెడ్డి. టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగినట్లు వివరించారు. అందరూ పదవుల కోసం పాకులాడుతే.. కోమటిరెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు రేవంత్. తాము చర్చించిన అంశాలను పార్టీలో చర్చకు పెట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసోం ముఖ్యమంత్రిపై రాష్ట్రంలోని అన్ని పీఎస్ లలో ఫిర్యాదు చేస్తే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదన్నారు. కేసీఆర్ ముమ్మాటికీ మోడీ కోవర్టేనని విమర్శించారు.
కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలను చీల్చేందుకు కేసీఆర్ పనిచేస్తున్నారని మండిపడ్డారు రేవంత్. ఆయన యూపీఏలో ఉన్న పార్టీలనే ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. ఫ్రంట్ పేరుతో టెంట్ వేసి.. కాంగ్రెస్ ను బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని అన్నారు. మోడీని బలహీన పరచాలంటే.. బీజేపీ భాగస్వామ్య పక్షాలను బలహీన పరచాలి.. కానీ కాంగ్రెస్ మద్దతున్న పార్టీలతో చర్చలు ఎందుకు జరుపుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పై సానుభూతి ఉన్నట్లు కేసీఆర్ నటిస్తున్నారని.. ఆయన్ను ఎవరూ నమ్మొద్దని సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో ఆ తర్వాత కాంగ్రెస్ ను కేసీఆర్ అనేక సార్లు మోసం చేసారని గుర్తు చేశారు రేవంత్. కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ నేతల ఇంటికి వచ్చినా.. దగ్గరకు రానిచ్చేది లేదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వచ్చి కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు నిలబడ్డా.. తమ బూట్లు నాకినా కూడా కలిసి పని చేయమని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ను అమలు చేస్తున్నారని.. కేసీఆర్ పుట్టినరోజు లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బర్త్ డే రోజు గాడిదల ముందు కేక్ లు కట్ చేసి నిరసన తెలుపుతామని తెలిపారు రేవంత్.
ఇక కోమటిరెడ్డి మాట్లాడుతూ… పార్టీ అంతర్గత విషయాలపై రేవంత్ తో డిస్కస్ చేసినట్లు చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు రోజూ వింటున్నామని.. మిర్చి రైతులు కూడా చనిపోతున్నారని గుర్తు చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందన్న కోమటిరెడ్డి.. రైతులు తక్కువ ధరకు అమ్ముకుంటే మధ్యవర్తుల దగ్గర అధిక ధరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు.
సిద్దిపేట, గజ్వేల్ లో ఉన్న వారే ప్రజలా మిగిలిన వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు కోమటిరెడ్డి. తమ నియోజక వర్గంలో డబుల్ బెడ్రూంలు ఎందుకు ఇవ్వరని ప్రశ్‌నించారు.
ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందని.. అందరం కలిసికట్టుగా పనిచేయాలని తాను, రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంతవరకు ఒక్క డీఏస్సీ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ పుట్టినరోజు కానుకగా నిరుద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కేసీఆర్ సానుభూతి అంతా నాటకమని తేల్చేశారు. భువనగిరి అభివృద్ధికి నిధులు అడిగితే ఇవ్వలేదని.. సభలో మాట్లాడతానన్నా కూడా మైక్ ఇవ్వలేదన్నారు. బుధవారం రాచకొండ కమీషనరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తానని.. చేవెళ్లకు నీటి కోసం సబితా ఇంద్రారెడ్డి ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు కోమటిరెడ్డి.
కేసీఆర్ ను పొగుడుతూ ఈమధ్య కోమటిరెడ్డి మాట్లాడడం కాంగ్రెస్ లో చర్చకు దారి తీసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు నేతలు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్.. కోమటిరెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరం కలసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.