ప్రధాని మోడీ తెలంగాణను కించపరిచారని టీఆర్ఎస్ ధర్నాలు, దిష్టిబొమ్మ దగ్ధాలు నిర్వహించింది. అటు కాంగ్రెస్ కూడా పోటాపోటీగా విమర్శలు చేస్తూనే నిరసన కార్యక్రమాలు చేస్తోంది. కానీ.. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ ఎక్కడకు వెళ్లారనేది తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. దీనిని రైజ్ చేస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
రాజకీయ అవసరాల కోసం తప్ప తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎప్పుడైనా గొంతెత్తావా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్. పార్లమెంట్ లో పదే పదే మోడీ తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరుస్తుంటే సోయి లేదా అని మండిపడ్డారు. అవకాశవాదమే తప్ప.. ఆత్మగౌరవం పట్టదా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు రేవంత్.
బడ్జెట్ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. తెలంగాణను అవమానించిన ఈ సమయంలో ఎక్కడ ఉన్నారనేది రేవంత్ ప్రశ్న. అయితే.. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. అయితే.. కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ.. ప్రత్యక్షంగా వీటిలో పాల్గొనలేదు.
మరోవైపు పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రసంగం రెండు వాస్తవాలను బట్టబయలు చేసిందని మరో ట్వీట్ చేశారు రేవంత్.
1. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్సే తప్ప టీఆర్ఎస్ కాదు
2. బీజేపీ తెలంగాణను ద్వేషిస్తుంది, ఆపార్టీ తెలంగాణ కోసం ఏమీ చేయలేదు
ఈ రెండు విషయాలు ప్రధాని ప్రసంగం ద్వారా తెలిసిపోయాయని అన్నారు. తెలంగాణ అమరవీరులను అవమానించినందుకు మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ హేట్స్ తెలంగాణ హాష్ ట్యాగ్ తో ఈ పోస్ట్ పెట్టారు రేవంత్.