టీ కాంగ్రెస్ జోరు పెంచుతోంది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తో పలువురు రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు ఆయనను విడివిడిగా కలిశారు.
ఈ భేటీలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్ర, అసెంబ్లీ సమావేశాలు తదితర అంశాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 6 నుండి సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించనున్నారు.యాత్రకు సంబంధించి రేవంత్ ఠాక్రేతో రూట్ మ్యాప్ పై చర్చించినట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నట్టు భట్టి విక్రమార్క ఠాక్రేతో చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే రేవంత్ రెడ్డి సమ్మక్క, సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభిస్తున్న యాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే సీతక్క విడుదల చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికే ఈ యాత్ర సాగుతుందని.. కాబట్టి ప్రతిఒక్కరూ ఇందులో పాల్గొనాలని ఆమె కోరారు. ములుగు నుంచి రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు.
ఇక భారత్ జోడో యాత్రకు అనుబంధంగా సాగుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రను టీ కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 50 నియోజక వర్గాల్లో రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగిస్తే.. మిగతా నియోజక వర్గాల్లో మిగతా కీలక నేతలు యాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నారు. అందుకే దీనికి సంబంధించి పక్కా ప్రణాళికను రూపొందించుకునే పనిలో పడ్డారు టీ కాంగ్రెస్ నేతలు.