ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 ఏళ్లుగా గూండాల రాజ్యం నడుస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ యువనేత పవన్ ను ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంతకుముందు ప్రజలు భయభయంగా ఉండేవారని.. హాత్ సే హాత్ యాత్ర ఇచ్చిన ధైర్యంతో వారంతా బయటకు వచ్చారని చెప్పారు. తమ యాత్ర చూసి బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందని విమర్శించారు.
పవన్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు కాపాడుతున్నారన్నారు రేవంత్. ఇది మంచిది కాదని హెచ్చరించారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి అనుబంధ విభాగం కాదని.. ఏ రాజకీయ పార్టీ వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు. ఆదేశాలు ఇస్తున్న వాళ్లు శాశ్వతం కాదన్న ఆయన.. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీని అణిచివేయాలని సూచించారు. సీసీటీవీలో అంతా కనిపిస్తోందని.. ఇప్పటిదాకా నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. పైగా తమతో పెట్టుకుంటే.. ఇలాగే జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది కాదన్నారు రేవంత్. ఓ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ టూర్ లో దాడి జరిగిందని.. ఇది తమ కాంగ్రెస్ పై జరిగిన దాడేనని వ్యాఖ్యానించారు. డీజీపీ రావాలి.. ప్రత్యక్ష్యంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న రేవంత్.. అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం ఇవ్వాలన్నారు. ప్రతీచోట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పిన రేవంత్.. గంజాయి బానిసలైన వినయ్ భాస్కర్ అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎమ్మెల్యేని కూడా అదుపులోకి తీసుకోవాలన్నారు. మొత్తం దాడుల కార్యక్రమానికి వినయ్ భాస్కర్ బాధ్యుడని.. అతడ్ని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని చెప్పారు.