సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు యువతీ యువకులు చనిపోవడం పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆరుగురు 22 ఏళ్ళ వయసు వారేనని.. ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న యువత ఇలా మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలా వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
దక్కన్ మాల్ లో జరిగిన సంఘటన మరువక ముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగిందన్నారు. ఇటీవల సికింద్రాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో ఇటీవల కుక్కలు ఒక పసికందును చంపేశాయని.. ఇప్పుడు అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టన పెట్టుకుందని.. విశ్వనగరం అంటూ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు కనీస భద్రత కల్పించడం లేదని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్‌లో గురువారం రాత్రి స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్ని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. వీరిలో వరంగల్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు మహబూబాబాద్ వాసులు, ఖమ్మంకు చెందిన ఒకరు ఉన్నారు.ఈ ఘటనలో మంటల తీవ్రత పెరిగే అవకాశముందని భావించిన అధికారులు.. స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నివాసాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు.