భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో చూస్తున్నాం. దళిత సంఘాలు, ప్రతిపక్షాలు కేసీఆర్ తీరును తప్పుబడుతూ ధర్నాలు, దీక్షలు చేస్తున్నాయి. దేశ ప్రజలకు సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల కార్యక్రమానికి పిలుపునిచ్చింది కాంగ్రెస్.
కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం చెబుతూ గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో గడిచిన 75 సంత్సరాలలో ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరడం లేదన్న సీఎం కామెంట్స్ ను పోలీసులకు వివరించారు.
రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తగా రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయన్నారు రేవంత్. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ వీరప్రసాద్ కు భారత రాజ్యాంగాన్ని అందజేశారు రేవంత్.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసీఆర్ పై ఫిర్యాదు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఆదివారం అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించనున్నారు.