మునుగోడు నియోజక వర్గం చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆఫీస్ లో జరిగిన అగ్నిప్రమాదంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, కార్యాలయాలు తగులబెట్టినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని స్పష్టం చేశారు.
ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు రేవంత్. తమను చూసి టీఆర్ఎస్, బీజేపీ వణికిపోతున్నాయని విమర్శించారు. మునుగోడులో కాంగ్రెస్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయి తమ క్యాడర్ ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు ఈ బెదిరింపులకు భయపడరని అన్నారు రేవంత్ రెడ్డి. తమ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళను 24 గంటల్లో అరెస్ట్ చేయలని డిమాండ్ చేశారు. లేదంటే ఎస్పీ కార్యాలయం ముందు తానే ధర్నా చేస్తానని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.
చండూరు మండలంలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఇదే సమయంలో పార్టీ ఆఫీస్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ప్రచార సామాగ్రి దగ్ధం అయింది. రాజకీయ కక్షలతోనే ఇది జరిగిందని.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు హస్తం నేతలు.