కలకలం రేపిన ఖదీర్ ఖాన్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మెదక్ పోలీసులు అతనిని ఐదు రోజులు కొట్టారని.. ఆ చివరి వీడియోను మరణ వాంగ్మూలంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఈ దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు
ఈ ఘటన అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదని.. సిట్ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అలాగే, 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
మెదక్ కు చెందిన ఖదీర్ అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని చావబాదారు. చివరకు అతను దొంగ కాదని వదిలేశారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖదీర్ చనిపోయాడు. ఆస్పత్రిలో ఉండగా పోలీసులు చేసిందంతా వివరించాడు ఖదీర్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి విచారణ జరపాలని ఐజీ చంద్రశేఖర్ ను ఆదేశించారు. కామారెడ్డికి చెందిన సీనియర్ పోలీస్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని.. ఐజీ చంద్రశేఖర్ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈఘటనలో బాధ్యులుగా భావిస్తున్న మెదక్ పీఎస్ సీఐ, ఎస్సైలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు డీజీపీ.