టీపీసీసీగా రేవంత్ నియామకం అయిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వరం పెంచింది. పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేసింది. రేవంత్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ పై తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. నిరుద్యోగ, రైతాంగం సమస్యలపై ప్రధానంగా తన వాయిస్ వినిపిస్తున్నారు. తాజాగా మరోసారి రేవంత్ ట్విట్టర్ ద్వారా బీజేపీ, టీఆర్ఎస్ లపై మండిపడ్డారు.
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల మధ్య రాష్ట్రం నలిగిపోతుందని విమర్శించారు. విభజన హామీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సాక్షిగా యూపీఏ హయాంలో ఇచ్చిన హామీలు ఇంత వరకు రెండు పార్టీలు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. విభజన హామీలను నెరవేర్చలేని ఈ రెండు పార్టీలు అవసరమా? ప్రజలారా ఓసారి ఆలోచించండి అని రేవంత్ ట్వీట్ చేశారు. ‘బీజేపీ, టీఆర్ఎస్ల రాజకీయ క్రీడలో తెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. స్వరాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లైనా హమీల అమలులో ఇద్దరూ విఫలమయ్యారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఈ రెండు పార్టీలు తెలంగాణకు, దేశానికి అవసరమా!? ఆలోచించండి!’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో రాష్ట్రం ప్రభుత్వం భూమి కేటాయించలేదని కేంద్రం చెబుతోంది. అయితే.. కేంద్రం మాట తప్పిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు తప్ప.. యూనివర్సిటీ ఏర్పాటులో మాత్రం ముందడుగు పడటం లేదు.