రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన కామెంట్స్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు హిమంత టార్గెట్ గా విమర్శల దాడి చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆయన డీఏన్ఏ ఏంటి.. అసోం.. చైనా పక్కనే ఉంది కదా అని అన్నారు. హిమంత డీఎన్ఏ చైనాదా? అసోందా? అనేది తేలాలని సెటైర్లు వేశారు.
మాతృత్వాన్ని అవమానించే మాటలు మాట్లాడతారా.. ఇదేనా బీజేపీ సంస్కృతి అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. భరతమాత అంటాం కదా.. మరి ఇవి భరతమాతకు పుట్టినోళ్లు మాట్లాడే మాటలేనా? అని ప్రశ్నించారు. సంస్కార హీనమైన చర్చ చేయాలని కాంగ్రెస్ అనుకోవడం లేదని.. అసోం సీఎంపై సోమవారం అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని తెలిపారు.
రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుందామని అనుకున్నాం.. రాహుల్ గాంధీపై హిమంత అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సంబరాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు రేవంత్.
సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అసోం సీఎంపై కేసులు పెట్టి నిరూపించుకోవాలని.. అప్పుడే ఆయన ఎవరికీ భయపడరు అని భావిస్తామన్నారు. కేసులు పెట్టి అసోం ముఖ్యమంత్రిని తెలంగాణకు రప్పించాలని డిమాండ్ చేశారు రేవంత్.