కేసీఆర్ కుటుంబ పాలన తెలంగాణకు ప్రమాదకరంగా మారిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ పాలనను అంతం చేయడానికే నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. నాయకులంతా సోనియా గాంధీ నాయకత్వంపై విశ్వాసం ప్రకటిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి భీమ్ రావ్ కుమార్తె సరస్వతి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్.
తెలంగాణ ఇచ్చింది కేసిఆర్ కుటుంబం కోసం కాదని.. రాష్ట్ర ఏర్పాటును తప్పుగా మాట్లాడిన బీజేపీ కోసం రాష్ట్రం ఇవ్వలేదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కోసమే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. వారం రోజులుగా ఢిల్లీలో కేసిఆర్ ఏం చేస్తున్నారన్న రేవంత్… ప్రజలు వరదల్లో నష్టపోతే కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని నిలదీశారు. తండ్రి ఢిల్లీలో కుమారుడు కాలు జారి హోం థియేటర్ లో కూర్చున్నారని సెటైర్లు వేశారు.
చికోటి చీకటి కోణంలో టీఎర్ఎస్ ఎమ్మేల్యేలు, మంత్రులు ఉన్నారని.. చీకటి మిత్రులు ఎవరో తేలాలన్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఇష్యూపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదన్న రేవంత్.. ఆ హవాలా ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఎస్వోటీ, టాస్క్ ఫోర్స్ ఏమైందంటూ ప్రశ్నించారు. గిరిజనుల మీద ప్రతాపం చూపే మీరు దొంగలకు, ఎమ్మెల్యే స్టిక్కర్ ఇచ్చే మంత్రుల మీద ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు. స్టిక్కర్ పారేయడానికి వీలు లేదని.. ఒకవేళ పోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రి మల్లారెడ్డిపై దుర్వినియోగం చేసిన వ్యక్తులపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇక బండి పాదయాత్రపై స్పందిస్తూ.. యాత్ర చేసే ముందు తెలంగాణ ఏర్పాటును తప్పు పట్టినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆయనకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ జెండా ఎగరడానికి వీలు లేదని.. కేంద్రం నుంచి వరద నష్ట పరిహారం కోసం కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని డిమాండ్ చేశారు.