కేసీఆర్ తో పొత్తు ప్రశ్నే లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీపై ఆయన నీడ కూడా పడనియ్యమని స్పష్టం చేశారు. గతంలో ఓసారి నమ్మి మోసపోయామని.. కేసీఆర్ నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్.. అసోం సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వెంటనే హిమంత శర్మను బర్తరఫ్ చేయాలని టీపీసీసీ తార్మానించిందని తెలిపారు రేవంత్ రెడ్డి. సోమవారం రాష్ట్రంలోని 709 పోలీసు స్టేషన్లలో అసోం సీఎంపై క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. తాను జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేస్తానన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ అసహ్యకరమైన భాష వాడడం కరెక్ట్ కాదని సూచించారు.
బీజేపీ సీఎం దిగజారి మాట్లాడితే మోడీ, అమిత్ షా, నడ్డా కనీసం ఖండించలేదని.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని అన్నారు రేవంత్. రాహుల్ కు జరిగిన అవమానం గాంధీ కుటుంబానికి కాదు.. దేశంలోని తల్లులకు జరిగినట్లేనని అభివర్ణించారు. హిమంత బరితెగించారని.. ఆయనపై చర్యలు తీసుకునే దమ్ము మోడీకి ఉందా? అని ప్రశ్నించారు.
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు కలిసే నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు రేవంత్. రెండు పార్టీల నేతలు అవినీతి చిట్టాలు ఉన్నాయని చెప్తున్నారు.. వాటిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ రెండు పార్టీలు తొడుదొంగలేనని విమర్శలు చేశారు.