కేంద్ర బడ్జెట్ ప్రసంగం గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏకపాత్రాభినయం చేశారంటూ విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రెస్ మీట్ పైనా సెటైర్లు వేశారు. సీఎం కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. విభజన చట్టం అంశాలు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ యూనిట్, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల విషయం ఏదీ మాట్లాడలేదని.. పైగా మోడీపై యుద్ధం ప్రకటిస్తారని ఆశించామని చెప్పారు. నిర్మలా సీతారామన్, మోడీ గురించి నీచంగా, జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారని అన్నారు.
రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉందని.. దాని ద్వారా దళితులు, బలహీన వర్గాలకు మేలు చేసే ప్రయత్నం చేయాలని తెలిపారు రేవంత్. రాజ్యాంగం మార్చాలనేది బీజేపీ కుట్ర అని దానికి కేసీఆర్ వంత పాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం రద్దు కోసం బీజేపీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. కేసీఆర్ ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని విమర్శించారు. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకోవాలని రెండు రోజుల పాటు గాంధీ భవన్ లో నిరసన దీక్షలు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకొకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కోస్తారని హెచ్చరించారు రేవంత్. యూపీలో బీజేపీని గెలిపించాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం ఉన్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. కేసీఆర్, అసదుద్దీన్ సుఫారీ గ్యాంగ్ అని విమర్శించారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం సుఫారీ తీసుకున్నారని అన్నారు. ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేస్తోందని.. అలాగే కేసీఆర్ భాషను ఖండిస్తున్నట్లు తెలిపారు. సిద్ధాంత పరంగా బీజేపీని వ్యతిరేకిస్తామని.. ప్రధాన మంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే తెలంగాణ పరువు ఏం కావాలని ప్రశ్నించారు.
కేసీఆర్ భాషను సభ్య సమాజం క్షమించదన్నారు రేవంత్. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో సమాధానం చెప్పాలన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమౌతుందని.. బడ్జెట్ లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పారు. రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వేటికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదన్న రేవంత్.. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినందుకు రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని ఆరోపించారు.
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని.. గోధుమలు, వరి కొనుగోళ్లకు నిధులు తగ్గించారని మండిపడ్డారు రేవంత్.
కరోనా ప్రభావం చూసాక కూడా పేదలకు వైద్యం అందించే చర్యలకు కేటాయింపులు లేవన్నారు. సాంకేతిక విద్య పేదలకు చేరువ చేయడానికి ప్రయత్నాలు లేవని.. వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఎలక్ట్రానిక్స్, బంగారం, వజ్రాల ధరలు తగ్గించారని.. సామాన్యులకు అవసరమయ్యేవి తగ్గలేదని చెప్పారు. సంపన్నులకు మేలు చేసేలా 10 శాతం మందికి ప్రయోజనం చేకూరేలా కేంద్ర బడ్జెట్ ఉందని విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.