– చెప్పినట్లుగా తొలివెలుగు స్టూడియోకు రేవంత్
– ఛాలెంజ్ నుంచి జారుకున్న కేటీఆర్
– తొలివెలుగు డిబేట్ టైమ్ లోనే..
– ఆస్క్ కేటీఆర్ అంటూ హడావుడి
– డిబేట్ కు ఎందుకు వెళ్లలేదని నిలదీసిన నెటిజన్స్
– ఎన్నాళ్లు దాక్కుంటారని రేవంత్ చురక
– నో వైట్ ఛాలెంజ్.. ఓన్లీ రైతు సమస్యలే!
– ఎప్పుడైనా సరే.. ఎక్కడికైనా సరే..
సవాల్ చేసిన వెంటనే ప్రతి సవాల్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు. రా.. తేల్చుకుందాం అని ముందుకు దూకుతారు. అదేంటో.. కేటీఆర్ మాత్రం వెనకడుగేశారు. రైతు సమస్యలపై చర్చించేందుకు తొలివెలుగు ఏర్పాటు చేసిన డిబేట్ కు రేవంత్ రెడ్డి రాగా.. కేటీఆర్ మాత్రం సైడయ్యారు. ఇన్నేళ్లుగా ఉన్న సమస్యలకు తొలివెలుగు వేదికగా పరిష్కారం దొరుకుతుందని అనుకున్న ప్రజలకు నిరాశనే మిగిల్చారు. ఇన్నేళ్ల కేసీఆర్ పాలనలో బాగుపడింది ఎవరంటే టీఆర్ఎస్ నేతలే అనేది విపక్షాల వాదన. అన్నదాతల ఆక్రందనలు.. నిరుద్యోగుల ఎదురుచూపులు.. ఉద్యోగ, ఉపాధ్యాయుల కష్టాలు.. ఇలా ఒక్కరేంటి..? రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమస్యలే. వాటన్నింటిపై చర్చించి ఓ పరిష్కారం మార్గం ఆలోచించాల్సింది పోయి.. సవాల్ చేసిన కేటీఆర్ తప్పించుకోవడం ఏంటని కడిగిపారేస్తున్నారు ప్రజలు.
చెప్పినట్లుగా తొలివెలుగు స్టూడియోకు వచ్చిన రేవంత్ రెడ్డి కేటీఆర్ ఎక్కడ అని అడిగారు. కేటీఆర్ వస్తారేమోనని చాలాసేపు వెయిట్ చేశారు. ఒకవేళ ఆయన బిజీగా ఉంటే.. అక్కడకి రమ్మన్నా వస్తానన్నారు. ఎంతసేపటికి కేటీఆర్ రాకపోయేసరికి ఎంతకాలం దాక్కుంటారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తొలివెలుగుతో మాట్లాడిన రేవంత్.. కేటీఆర్, కేసీఆర్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ నాశనాన్ని కోరుకుంటే వాళ్లే నాశనం అవుతారని ఆరోపించారు. కేసీఆర్ పై కేటీఆర్ కు నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలో లేని బీజేపీని పైకి లేపేందుకు కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ తనపై తాను విశ్వాసం కోల్పోయారని ఆరోపించారు రేవంత్.
కేటీఆర్ ముఖం చాటేయడంతో అధికారంలో ఉన్నవారే ప్రజల సమస్యలపై మాట్లడలేకపోతే.. ఇంకా ఆ పదవులు ఎందుకు అని ప్రశ్నించారు రేవంత్. ఇప్పుడు కాకపోయినా.. తర్వాతైనా రెడీ అన్నారు. ఎక్కడికైనా సరే.. ఏ స్టూడియోకి రమ్మన్నా వస్తానని స్పష్టం చేశారు రేవంత్.