కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంకొన్ని రోజుల్లో తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో సందడి నెలకొంది. రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాహుల్ టూర్ పై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
రాహుల్ పర్యటనను సక్సెస్ చేసేందుకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే పనిలో బిజీగా ఉన్నారు మాణిక్కం ఠాకూర్, రేవంత్ రెడ్డి. ఠాకూర్ ముఖ్య నాయకులతో కీలక చర్చలు జరుపుతుంటే.. రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో సభను విజయవంతం చేసే పనిపై ఫోకస్ పెట్టారు.
మే 6న రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నారు రాహుల్. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు రేవంత్ వరంగల్ టూర్ ఫిక్స్ అయింది. 21న సాయంత్రం 4 గంటలకు వరంగల్ లో ఆర్ట్స్ కాలేజీలో సభ స్థలి పరిశీలన, నాయకులతో సమీక్ష జరపనున్నారు టీపీసీసీ చీఫ్. రాత్రికి వరంగల్ లోనే ఆయన బస చేయనున్నారు.
22న ఉదయం 11 గంటలకు ఖమ్మంలో జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు రేవంత్. 23న మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్(ఇందిరా భవన్)లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం.. టీపీసీసీ, పీఏసీ, డీసీసీ, అనుబంధ సంఘాలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినెటర్లు ఇతర ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.
మొత్తానికి రాహుల్ టూర్ ను సక్సెస్ చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకత్వం చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత గట్టిగా ఉందో చాటిచెప్పేందుకు ఈ సభను వాడుకోవాలని చూస్తున్నారు. 5 లక్షల మంది జనాన్ని సమీకరించి రాహుల్ సభలో కూర్చోబెట్టాలని ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఈ మీటింగ్ విజయవంతం అయితే పార్టీలో నూతనోత్సాహం వస్తుందని నేతలు భావిస్తున్నారు