రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు పంపింది. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అబద్దాలు చెప్పారని హెచ్ఎండీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక నోటీసు అందిన 48 గంటల్లోగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు హెచ్ఎండీఏ అధికారులు. లోక్ సభ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఏం మాట్లాడినా ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది కాబట్టి చేసే ప్రతి ప్రకటన , మాట్లాడే మాటకు బాధ్యత ఉండాలని హెచ్ఎండీఏ ఇచ్చిన నోటీసులో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారమే ఓఆర్ఆర్ ను లీజుకు తీసుకున్నట్లు హెచ్ఎండీఏ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 9న టీవీఓటీ టెండర్ నోటిషికేషన్ జారీ చేసిందని, అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించేందుకు టెండర్ల ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందని అధికారులు తెలిపారు.ఇక టెండర్ ప్రక్రియకు సంబంధించిన పత్రాలు, ఐఆర్భి ఇన్ ఫ్రాకు జారీ చేసిన పత్రాలు మరియు ఇతర డీటైల్స్ ఆన్ లైన్ లో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఓఆర్ఆర్ లీజుపై ప్రజలకు అన్ని విధాలుగా సమాచారం ఉన్నప్పటికీ బాధ్యతాయుతమై పదవిలో ఉన్నప్పటికీ దానిపై రేవంత్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని నోటీసుల్లో హెచ్ఎండీఏ తెలిపింది. రేవంత్ రెడ్డి తమ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని రాజకీయంగా సంచలనం చేసేందుకు తప్పుడు కథనాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. ఇక విలేకరుల సమావేశంలో చెల్లింపు కోసం సమయాన్ని పొడిగించాలని ఐఆర్బీ కంపెనీ కోరితే.. అందుకు పొడగించడానికి హెచ్ఎండీఏ ఆసక్తి చూపించిందని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.
ముందస్తు చెల్లింపు ఒప్పందం లేకుంటే, ఐఆర్బీ సమయం పొడగింపు కోరడం పచ్చి అబద్దమని..కేవలం పొలిటికల్ మైలేజ్ పొందాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రకటన చేసినట్లు అర్థమవుతోందని హెచ్ఎండీఏ రేవంత్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో ఉంది. ఇక ఈ నోటీసులకు రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని హెచ్ఎండీఏ కోరింది.