కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ 23న తెలంగాణ రాష్ట్రంలోనికి ప్రవేశిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దీని గురించి ఈరోజు మీడియాతో మాట్లాడారు. 23న కర్ణాటక నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందని ఆయన వివరించారు.
యాత్ర పై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్ లను నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశిస్తోందని ఆయన వివరించారు.
హైదరాబాద్ నగరంలో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ వరకు జోడో యాత్ర కొనసాగుతుందన్నారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు.