రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చినజీయర్ అంశం కలకలం రేపుతోంది. ఆయన్ను నగర బహిష్కరణ చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుండగా.. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తోంది. దీనికి చినజీయర్ స్వామి ఆలయ ఆగమశాస్త్ర సలహాదారుగా ఉన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
రేవంత్ చేసిన ట్వీట్
‘‘తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్ ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించి… మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’
వన దేవతలు సమ్మక్క, సారలమ్మలపై చినజీయర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సంస్కృతిని అవమానించడమేనని ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు గిరిజన సంఘాల నాయకులు. రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తున్నారు. చినజీయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.