సిద్ధిపేటలో పత్తి రైతు బీరయ్య.. నల్గొండలో కౌలు రైతు లింగయ్య.. ఆదిలాబాద్ లో వరి రైతు దేవిదాస్.. కొత్తగూడెంలో బాలాజీ… జనగామలో లచ్చిరాం… ఇలా ఒక్కరోజే బంగారు తెలంగాణలో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి ఇలాగే కొనసాగితే.. రాష్ట్రంలో అన్నదాత ఉండేవాడు అని చెప్పుకునే రోజులు వస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. రైతుల్ని కోటీశ్వరుల్ని చేస్తానన్న ప్రభుత్వం మాటలకే పరిమితం కావడంతో.. అప్పుల బాధతో అన్నదాతలు తనువు చాలిస్తున్నారని అంటున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలో భారీ, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేలు, మిగతా పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం చేయాలన్నారు.
రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట మంచిగా పడితే ఎకరాకు రూ.3.50 లక్షల ఆదాయం వస్తుందని ఆశపడ్డారు. ఒక్కో ఎకరాకు లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారు. అయితే.. తామర తెగులుతో తీవ్రంగా నష్టపోయారు మిర్చి రైతులు. ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పి తర్వాత తప్పించుకొని మంత్రులను, అధికారులను పంపించారని అన్నారు రేవంత్.
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో 25 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని.. రైతులకు దాదాపు రూ.8.633 కోట్ల నష్టం వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్. ఇలాంటి సమయాల్లో కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులను ఏం చేశారో చెప్పాలని లేఖలో నిలదీశారు. వెంటనే రైతులను అదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతుందని హెచ్చరించారు రేవంత్.